
ఆర్థికసేవల్లో ప్రజా పాలకుడు నాగరాజు
తెనాలి: శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును ఆర్థికరంగంలో పీపుల్స్ అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు పొందిన మద్దిరాల నాగరాజుకు బహూకరించటం సముచితమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు నాయుడమ్మ తపించారన్నారు. ఆ దిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని చెప్పారు. వికసిత్ భారత్‌కు వెన్నెముక అయిన ఆర్థికరంగంలో నాగరాజు, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. త్రిపుర ఉప ముఖ్యమంత్రి / ఫైనాన్స్ మంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు.
నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తాం
చైన్నెలోని జాతీయ చర్మ పరిశోధన సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వి.కాంత్ తన ప్రసంగంలో డాక్టర్ నాయుడమ్మను ‘నేషన్ బిల్డర్’గా అభివర్ణించారు. విదేశాలు టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ఎగుమతులు ప్రధానమైన తోలు పరిశ్రమలో 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వృద్ధి నిజంగా సవాలు అని, నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తామని చెప్పారు. ఫౌండేషన్ వైస్‌చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తమ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. సాటి మనిషిని అంటుకుంటే పాపమనే మకిల మనస్తత్వాలను శుద్ధిచేసిన సామాజిక శాస్త్రవేత్త, చర్మకారుల చేతివాసనలనే కాదు... సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన పరిశోధకుడిగా, మానవతావాదిగా నాయుడమ్మ ప్రజల హృదయాల్లో నిలిచి పోయారని చెప్పారు. తొలుత డాక్టర్ నాగరాజుకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతులమీదుగా నాయుడమ్మ అవార్డును ప్రదానం చేశారు. నాగరాజు దంపతులను సత్కరించారు. నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను బహూకరించారు. యడ్లపాటి స్వరూపరాణి, అయినాల మల్లేశ్వరరావు, తమిరిశ అనంతాచార్యులు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయుడమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
సమాజాభివృద్ధికి కృషి
అవార్డు గ్రహీత మాట్లాడుతూ... భారత్ ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు, ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు. ఇటీవల మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభ చాటిందన్నారు. దేశంలోని ఎంఎస్‌ఎంఈలు 11 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తూ వికసిత్ భారత్‌కు ఇంజిన్లుగా ఉన్నాయని, డిజిటల్ మౌలిక వసతులు పునాదిగా ఉన్నట్టు నాగరాజు చెప్పారు. ఈ డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదని, ప్రపంచానికి ఒక నమూనాగా వివరించారు. ఇంతటి ఘన విజయాలు అన్నింటికీ పలు వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా నిలిచాయన్నారు.