
అక్షరమే ఆయుధం
పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరం. మీడియా స్వేచ్ఛను పునరుద్ధరించడానికి నిష్పాక్షిక న్యాయపరమైన విచారణ, జర్నలిస్టుల సురక్ష చట్టాలు, ప్రభుత్వం – మీడియా సంబంధాల పారదర్శకత చాలా అవసరం. పత్రికా స్వేచ్ఛ అంటే మీడియా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రభుత్వ హస్తం లేకుండా వార్తలను ప్రచురించే హక్కు కలిగి ఉండడం. కానీ నేడు పాత్రికేయులపై, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులు, అన్యాయంగా జరుగుతున్న అరెస్టులపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – కలకోటి సునీల్‌కుమార్, న్యాయవాది, వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు
నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలుస్తూ, వాస్తవాలను ప్రచురిస్తూ, ప్రజలకు– ప్రభుత్వానికి వారధిగా ఉండే ఏ పత్రికా జర్నలిస్ట్ స్వేచ్ఛనైనా హరించడం అప్రజాస్వామికం. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పత్రికాముఖంగా ఖండించాలనేగానీ ఎడిటర్‌పై అక్రమకేసులు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు. సాక్షి లేదా మరేదైనా పత్రిక ఇచ్చిన వార్తా కథనాలతో ప్రభుత్వం విభేదిస్తే తప్పకుండా ఖండించవచ్చు. తమ కోణంలో చెప్పినా కానీ స్పందించలేని పక్షంలో ఆ సంస్థపై నోటీసులు ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేరుగా కేసులు నమోదు చేయడం సరికాదు. – కారుమంచి రామారావు, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ