
క్రీడలతోనూ ఉత్తమ భవిష్యత్తు
కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ నాయకుల నిరసన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడదల చేయాలని, నిరుద్యోగ భృతి మంజూరు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా షేక్ వలి మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా అధికారం వచ్చిన 100 రోజుల్లో 107–108 జీఓలు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు, పైగా మెడికల్ కాలేజీ లను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ఇవ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇవ్వాలని తీర్మానం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్ప నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీను, మరియదాసు గుంటూరు జిల్లా కార్యదర్శి యస్వంత్ నగర కార్యదర్శి బన్నీ సాయి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు గోపి, నవీన్, రెహ్మాన్, ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా తుళ్ళూరు మండలంలో 36.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో మి.మీ. కురిసింది. సగటు 10.1 మి.మీ.గా నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలంలో 35.4 మి.మీ., తాడేపల్లి 25.8, దుగ్గిరాల 18.6, కొల్లిపర 15.4, పెదకాకాని 11.2, కాకుమాను 9, గుంటూరు పశ్చిమ 7.6, గుంటూరు తూర్పు 6.4, మంగళగిరి 6, తాడికొండ 5.2, పొన్నూరు 2.2, మేడికొండూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. సెప్టెంబర్ మాసం 23వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 122.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 245 మి.మీ. వర్షపాతం నమోదైంది.
చిలకలూరిపేటటౌన్: ఫోన్‌లో మెసేజ్‌లు పెడుతూ వివాహితను వేధింపులకు గురి చేస్తున్న పురపాలక సంఘం కాంట్రాక్ట్ ఉద్యోగిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం...పట్టణంలోని భావనరుషినగర్‌లో నివాసం ఉంటున్న అవ్వారు రమేష్ తన ఇంటి పక్కనే ఉంటున్న వివాహితకు కొంతకాలంగా ఇబ్బందికరమైన మెసేజ్‌లను పెడుతున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యా దు చేసింది. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇద్దరి నివాసాలు పక్కపక్కనే ఉండటం వల్ల పరిచయం ఏర్పడిందని, దానిని అడ్డుపెట్టుకొని రమేష్ ఈ వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వెల్లడించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పెదకాకాని(ఏఎన్‌యు): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అంతర కళాశాలల పురుషుల కబడ్డీ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవంలో వీసీ ఆచార్య కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషికి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా మనిషి ఎదుగుదల, వికాసం, శరీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు క్రీడలను అశ్రద్ధ చేయడం వలన పిల్లలు క్రీడలకు దూరం అవుతున్నారన్నారు. క్రీడా నైపుణ్యాలు, క్రీడాకారులు సామర్ధ్యం, క్రీడల విశిష్టతను కొనియాడారు. వర్సిటీ ఆర్ట్స్, లా ప్రిన్సిపాల్, టోర్నమెంట్ ప్రెసిడెంట్ ఆచార్య ఎం.సురేష్‌కుమార్, రెక్టార్ ఆచార్య ఆర్ శివరాంప్రసాద్, రిజిష్టార్ జి.సింహాచలం, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య పీపీఎస్ పౌల్‌కుమార్ పాల్గొన్నారు. కమిటీ మెంబర్లుగా డాక్టర్ పి.శ్రీనివాసరావు, పి.గణేష్, కె.ప్రసన్నకుమార్‌లు వ్యవహరించారు. ఏఎన్‌యూ పరిధిలోని 21 కళాశాలల జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి.
హత్య కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
మంగళగిరి: ఆరు సంవత్సరాల క్రితం నగర పరిధి లోని కొత్తపేటలో జరిగిన హత్య కేసు ఘటనలో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ 5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... 2019, ఆగస్టు 2న మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలెం గ్రామానికి చెందిన బొద్దులూరి వెంకటరమణ(43) కొత్తపేటకు చెందిన మోటు కూరి భాస్కరరావు మద్యం మత్తులో ఘర్షణకు పాల్పడ్డారు. అనంతరం చుట్టూ వున్నవారు వారించడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. అయితే వెంకటరమణ కొత్తపేటలోని భాస్కరరావు నివాసానికి వెళ్లి తనపై ఎందుకు ఘర్షణకు దిగావని వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆగ్రహం చెందిన భాస్కరరావు తన ఇంటిలోని కుట్టుమిషన్‌పై వున్న కత్తెరతో వెంకట రమణను పొట్టలో పొడవగా గాయాలపాలైన వెంకట రమణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై అప్పటి ఎస్‌ఐ సీహెచ్ రవిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడు భాస్కరరావును కోర్టులో హాజరుపరచి చార్జిషీటు దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మూడో ఏడీజే కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముబీన బేగం వాదనలు వినిపించగా సదరు కేసును విచారణ జరిపిన జిల్లా మూడవ ఏడీజే కోర్టు జడ్జి సి.వెంకట నాగ శ్రీనివాసరావు ముద్దాయి భాస్కరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు.
ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు
వర్సిటీలో అంతర కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు ప్రారంభం