
కూటమిపై న్యాయ పోరాటం
వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం రాష్ట్ర నేత పోలూరి వెంకటరెడ్డి వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై న్యాయవాదుల నిరసన
పట్నంబజారు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమైన చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వైద్య విద్య, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో నిరుపేదలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పేద విద్యార్థులు కూడా వైద్యులు కావాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తొలి విడతలో ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రారంభించారని వివరించారు. మిగిలిన కళాశాలల నిర్మాణాలు పలు దశల్లో ఉన్న వాస్తవం అందరికీ తెలిసిందేనన్నారు. తన సుదీర్ఘ పాలనలో రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా తేలేని చంద్రబాబు, జగన్ తెచ్చిన వాటిని ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్య, పేద ప్రజలకు వైద్య సేవలను దూరం చేసే దుశ్చర్యలకు తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వజ్రాల రాజశేఖర్ రెడ్డి, కళ్ళం వెంకటరమణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, వాసం సూరిబాబు, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, క్రాంతి, వేముల ప్రసాద్, బాబురావు, శ్యామల, మంజుల, వెంకటరమణ, వరదాయిని, శ్రీనివాసరావు, సయ్యద్ బాబు, సుబ్బారావు, సుబ్బారెడ్డి, ఖాజావలి, లలిత, మొండితోక శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రెడ్డి, గోపిరెడ్డి పద్మాకర్, పాపిరెడ్డి, కోటిలింగారెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు.