
భక్తి రసానందం పద్యనాటకాలు
తెనాలి: కళల కాణాచి, తెనాలి, ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ‘వీణా అవార్డ్స్–2025’ శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రముఖ నటీమణి, పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షురాలు, బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలనతో పోటీలను ఆరంభించారు. తొలిగా టీజీవీ కల్చరల్ అకాడమీ, కర్నూలు వారి ‘శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. శ్రీవెంకటేశ్వరుడిపై అమిత భక్తిభావం కలిగిన అనంతాచార్యుడు స్వామివారి కై ంకర్యాలు కోసం నియమితుడవటం, అందుకోసం ఆయన పడే కష్టాలు, చివరకు శ్రీవేంకటేశ్వరుడే మారురూపంలో వచ్చి సాయం చేయటం కథాంశం. శ్రీవెంకటేశ్వరుడుగా టి.రాజశేఖరరావు, అనంతాచార్యులుగా జె.మోహన్ నాయర్, మహాలక్ష్మిగా సురభి హారికకార్తీక్, అలిమేలు మంగమ్మగా సురభి వెంగమాంబ నటించారు. సంగీతం పీజీ వెంకటేశ్వర్లు, శారదా ప్రసన్న రచనకు వీవీ రమణారెడ్డి దర్శకత్వం వహించారు. రెండో ప్రదర్శనగా పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అండ్ లలిత కళాపరిషత్, అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. కీ.శే పోతులయ్య రచనకు రామగోంద్‌సాగర్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుడుగా గంటా శివశంకర్, కాలభైరవుడుగా దాసరి దయానంద్, దుర్యోధనుడుగా సోమర లక్ష్మీనారాయణ, నారదుడుగా సి.శ్రీరాములు, ద్రౌపదిగా ఎస్.విజయశారద నటించారు. రాత్రి చివరి ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం శ్రీనివాసరావు పోలుదాసు, ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాసరావు, సురభి లలిత, పవన్‌కళ్యాణ్, షణ్ముఖి నాగుమంత్ర, గోవర్ధనరెడ్డి, చైతన్య నటించారు.

భక్తి రసానందం పద్యనాటకాలు