ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తాడికొండ: వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం లంకలో ఆమె ఆదివారం పర్యటించారు. ఆమె లంక గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 5.67 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని, ఈ మేరకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. ఇంకా ఎక్కువ వరద వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలు ఎవరు నది దాటడానికి, దుస్తులు ఉతకడానికి గానీ, ఇతర పనులు చేయడానికి నది వద్దకు వెళ్లవద్దని అన్నారు. నదిలో చేపలు పట్టడం, పశువులను వదలడం తదితర కార్యకలాపాలు చేయవద్దని సూచించారు. అధికారులు తక్షణం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, అన్నవరంపాలెం లంక గ్రామాల ప్రజలు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 0863 2234014 ఫోన్ నంబరుకు సమాచారం అందించవచ్చని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, ఎంపీడీవో కానూరి శిల్ప, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. కృష్ణాతీరంలో పర్యటన
● తాళ్లాయపాలెం లంకలో పర్యటించిన
కలెక్టర్ తమీమ్ అన్సారియా
● కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
ఏర్పాటు(0863–2234014)
తాడేపల్లి రూరల్: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు సూచనలు, సలహాలు అందజేసే పనిలో పడ్డారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో కరకట్ట లోపల నివాసముండే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రకాశం బ్యారేజ్‌పై సందర్శకులు వచ్చిన సమయంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద సందర్శకులు నీటిలో దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. సీతానగరం, మహానాడు ప్రాంతాల్లో కృష్ణానది తీరంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆమె సూచించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు కృష్ణాతీరంలో రెవెన్యూ సిబ్బంది అంచనా వేస్తే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె సూచించారు.
1/1
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి