కర్షకులను ఇబ్బంది పెట్టవద్దు
ప్రత్తిపాడు: డీఏపీ, యూరియా విక్రయించే సమయంలో వ్యాపారులు రైతులను ఇబ్బంది పెట్టడానికి వీల్లేదని గుంటూరు ఏడీఏ ఎన్.మోహన్‌రావు అన్నారు. జీడీసీఎంఎస్‌ల్లో డీఏపీ, యూరియా ఎరువులు కావాలంటే నానో యూరియా అంటగడుతున్న వైనంపై ఈ నెల 20న ‘సాక్షి’లో ‘ఇవేం కష్టాలు నాయనో’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులోని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లో శుక్రవారం ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లోని ఫెర్టిలైజర్ డీలర్లతో ఏడీఏ ఎన్. మోహన్‌రావు సమావేశం నిర్వహించారు. యూరియా, డీఏపీ విక్రయాలకు ఇతర ఉత్పత్తులతో ముడి పెట్టడానికి వీల్లేదన్నారు. ఇకపై ఎక్కడా ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని పేర్కొన్నారు. రబీ పంటలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఏడీఏ తెలిపారు. వ్యాపారులు ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల వ్యవసాయాధికారులు షేక్ సుగుణబేగం, సునీత, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు ఏడీఏ మోహన్‌రావు
కర్షకులను ఇబ్బంది పెట్టవద్దు


