
కలెక్టర్ ఆదేశాల్ని ఖాతరు చేయని డీఈఓ?
కాళోజీ సెంటర్: వరంగల్ డీఈఓ కార్యాలయంలో ఫారన్ డిప్యుటేషన్‌పై విధులు కొనసాగిస్తున్న ఆర్.రాజగోపాల్‌రెడ్డి డిప్యుటేషన్ రద్దు చేసి వెంటనే విధులనుంచి విడుదల చేయాలని, అదేవిధంగా డీఐఈటీ మనోజ్‌ను హనుమకొండ డీఈఓ కార్యాలయానికి పంపాలని కలెక్టర్ సత్యశారద ఈ నెల 1న డీఈఓను ఆదేశిస్తూ మెమో జారీ చేశారు. ఈవిషయంపై ఇప్పటి వరకు డీఈఓ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యాశాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కలెక్టర్ మెమోను ఖాతరు చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. విద్యాశాఖ కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు, డీఈఓ వ్యవహారశైలిపై పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జనవరి 28న కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డీఈఓ కార్యాలయంలో సుదీర్ఘంగా ఉంటున్న ఆర్.రాజగోపాల్‌రెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మసాగర్ మండలం మల్లికుదుర్ల ఎంపీపీఎస్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉన్న ఆర్.రాజగోపాల్‌రెడ్డిని జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాకు కేటాయించారని, సందర్భం(2)ను అనుసరించి ఏ ఉద్యోగి అయినా గరిష్టంగా మూడేళ్లు లేదా ప్రజా ప్రయోజనాల రీత్యా ఐదేళ్లు సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫారిన్ డిప్యుటేషన్ (విదేశీ ప్రతినిధి)లో కొనసాగవచ్చని వివరించారు. కానీ, ఎస్జీటీగా పాఠశాలలో విద్యార్థులకు బోధించాల్సిన రాజగోపాల్‌రెడ్డి నిబంధలకు విరుద్ధంగా పదేళ్లుగా వరంగల్ డీఈఓ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారని తెలిపారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించి డిప్యుటేషన్‌ను రద్దు చేసేలా డీఈఓను ఆదేశించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్.. వెంటనే కార్యాలయ సిబ్బందితోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నట్లు సమాచారం. ‘రాజగోపాల్ ఎవరు.. ఎక్కడ డ్యూటీ చేయాలి.. ఎంతకాలం నుంచి డిప్యుటేషన్‌లో పని చేస్తున్నారు?’ అని అడిగి తెలుసుకొని వెంటనే ఆయనకు మంచి స్కూల్ కేటాయించి పంపాలని డీఈఓను ఆదేశిస్తూ ఈనెల 1న మెమో జారీ చేశారు. కాగా, దీన్ని డీఈఓ జ్ఞానేశ్వర్ అమలు చేయడం లేదని, కలెక్టర్ ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలుపుతున్నారు. ఈవిషయమై డీఈఓ జ్ఞానేశ్వర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
పదేళ్లుగా డిప్యుటేషన్‌లో ఉన్న వ్యక్తిని
రిలీవ్ చేయాలని కలెక్టర్ మెమో
డీఈఓ అమలు చేయడం లేదంటున్న
ఉపాధ్యాయ సంఘాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment