![క్యాన్సర్.. పదం మాత్రమే](/styles/webp/s3/article_images/2025/02/5/04hmkd709-600502_mr-1738697028-0.jpg.webp?itok=Z5eKKx3d)
క్యాన్సర్.. పదం మాత్రమే
● చికిత్సతో నయం చేయొచ్చు
● ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి
● నేను క్యాన్సర్‌ను ఓడించా..
సినీ నటి గౌతమి
నయీంనగర్: క్యాన్సర్.. ఒక పదం మాత్రమేనని, చికిత్స ద్వారా నయం చేయొచ్చని సినీ నటి, క్యాన్సర్ విజేత గౌతమి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రతిమ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం వరకు రెండు వేల మంది విద్యార్థులతో క్యాన్సర్ వాకథాన్ నిర్వహించారు. ఇందులో సినీ నటి, క్యాన్సర్ విజేత గౌతమి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, డాక్టర్ హరిణి పాల్గొన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో నటి గౌతమి మాట్లాడతూ.. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించానన్నారు. తనలాగే క్యాన్సర్ బాధితులు విజయం సాధించొన్నారు. క్యాన్సర్ అనే భయం వదిలేయాలని.. అది ఒక పదం మాత్రమే అన్నారు. ప్రభుత్వం క్యాన్సర్ బాధితులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. వరంగల్ ఎంపీ కడియం డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే నయమవుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌పై అవగాహన ఉండాలన్నారు. మద్య, ధూమపానం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి క్యాన్సర్ రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ డాక్టర్ హరిణి మాట్లాడుతూ క్యాన్సర్ ఇకపై మరణశిక్ష కాదని, ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స చేయడంతో ప్రాణాలను కాపాడొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ రమేశ్, డైరెక్టర్లు డాక్టర్.ప్రతీక్, డాక్టర్.రాహుల్, డాక్టర్.అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment