
పోలీస్ సైరన్ సైలెంట్!
వరంగల్ క్రైం: హత్యలు, చైన్‌స్నాచింగ్‌లతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హనుమకొండ సబ్ డివిజన్ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఐజీ కార్యాలయానికి కూత వేటు దూరంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ హత్య జరి గింది. హనుమకొండ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో కూరగాయలకు వెళ్లి వస్తుండగా ఓ మహి ళ మెడలో నుంచి దొంగలు చైన్‌స్నాచింగ్‌కు పాల్ప డ్డారు. దొంగలు, అక్రమార్కులకు పోలీసులు అంటే భయం లేకుండా పోతోంది. పట్టపగలు హత్యలు, దొంగతనాలను కట్టడి చేయకుండా పోలీసులు ఏం చేస్తున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం పోలీసింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది.. బ్లూకోల్ట్స్ సిబ్బంది నిత్యం ప్రజల మధ్య విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.. గల్లీల్లో పెట్రోలింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దొంగలు రెచ్చిపోయి పట్టపగలే దర్జాగా చోరీలకు పాల్ప డుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.
జనవరి నుంచి ఐదు చైన్‌స్నాచింగ్‌లు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నగరంలో జనవరి నుంచి దొంగలు ఐదు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. పట్టపగలే చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగలు ఒక పక్క పోలీసులకు సవాల్ విసురుతూ మరో పక్క ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. నగరంలో మహిళలు ఒంటరిగా రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు.
కంటిమీద కునుకు కరువు..
కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హత్యలు, దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా మంది పోలీసు అధికారులు మాత్రం భూముల పంచాయితీలు చేసి అక్రమంగా లక్షల రూపాయలు పోగుచేసుకుంటున్నారని ఆరో పణలు వస్తున్నాయి. కొన్ని పోలీస్‌స్టేషన్లలో భూపంచాయితీలకు తప్ప మరే సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో రెండు హత్యలు జరిగాయి. ఒకటి వెస్ట్‌జోన్, మరొకటి సెంట్రల్ జోన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. నెల రోజుల్లో పగటి పూట 7, రాత్రి పూట 21 దొంగతనాలు జరిగాయి. దీనిని బట్టి పోలీసుల పెట్రోలింగ్, అధికారుల పర్యవేక్షణ తీరు ఎలా ఉందో అర్థం అవుతోంది. హత్యలు, దొంగతనాలు వరుసగా జరుగుతున్నా ఉన్నతాధికారులకు పట్టింపు లేకపోవడం గమనార్హం. వరుస పరిణామాలను గమనిస్తే పోలీస్ సైరన్ సైలెంట్ అయ్యిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరికి విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నా పోలీసుల చర్యలు అంతంత మాత్రమే ఉండడం గమనార్హం. పోలీస్ శాఖను గాడిలో పెట్టాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం కమిషనరేట్ ప్రజలకు శాపంగా మారింది.
కమిషనరేట్ పరిధిలో పట్టుతప్పుతున్న పాలన
నగరంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు.. పట్టపగలే హత్యలు
పోలీస్‌స్టేషన్లలో భూముల
పంచాయితీలకే మొదటి ప్రాధాన్యం
సాయంత్రం ఉండని అధికారులు.. ప్రజలకు తప్పని ఇబ్బందులు
కొలువు ఎక్కడైనా.. ఉండేది హనుమకొండలోనే!
కమిషనరేట్‌లోని మూడు డివిజన్ల పరిధిలో కొలువు ఎక్కడ చేసినా పోలీసు అధికారులు నివాసం ఉండేది మాత్రం హనుమకొండలోనే. గ్రామీణ ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో సాయంత్రం ఆరు గంటలు దాటితే ఎస్‌హెచ్‌ఓలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు స్థానికంగా ఉండడం లేదు. ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఉండకపోవడంతో అదేబాటలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది అప్ అండ్ డౌన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారులు ఎవరు కూడా ఉండకపోవడంతో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పూట జరిగే సంఘటనలతో పోలీస్ స్టేషన్లకు వెళ్లినా లాభం లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో పరిపాలన పట్టుతప్పుతోంది. ఫలితంగా పోలీసులంటే అక్రమార్కులు, దొంగలకు భయం పోయింది. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుని పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment