
బుచ్చమ్మకు అండగా యంత్రాంగం
వరంగల్: వృద్ధురాలు బుచ్చమ్మకు అధికార యంత్రాగం అండగా నిలిచింది. ‘ఆఖరి మజిలీలో ఆకలి కేకలు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పందించారు. ఆమెకు న్యాయం చేయాలని డీడబ్ల్యూఓ బి.రాజమణిని ఆదేశించారు. వెంటనే డీడబ్ల్యూఓ, వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుధ్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, డీటీ దినకర్ రామన్నపేటలోని వృద్ధురాలి చిన్నకొడుకు సోమేశ్వర్, కోడలు సరిత ఇంటికి వెళ్లారు. కాశిబుగ్గలో రోడ్డుపై ఉన్న బుచ్చమ్మ అప్పటికే స్థానికుల సాయంతో ఆటోలో వారి ఇంటికి వెళ్లింది. అధి కారులు ఆమెతో మాట్లాడారు. లార్డ్ ఓల్డ్‌ఏజ్ హోంకు తీసుకెళ్లాలని తాము భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆమె పోషణ చూసుకుంటామని చిన్న కొడుకు, చిన్న కోడలు చెప్పారు. పెద్ద కొడుకుని కూడా పిలిచి మాట్లాడి బాధ్యత తీసుకోవాలని చెప్పాలని అధికారులను కోరారు. ఇద్దరు కొడుకులు, కూతురిని పిలిపించి మాట్లాడేంత వరకు పోషణ బాధ్యత మాదే అని, లేనిచో చట్టపరమైన చర్యలకు బాధ్యులమని చిన్నకొడుకు, చిన్న కోడలు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినట్లు అనిరుధ్ తెలిపారు. బుచ్చమ్మను పర్యవేక్షించాలని అంగన్‌వాడీ సిబ్బందిని డీడబ్ల్యూఓ ఆదేశించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన
డీడబ్ల్యూఓ, అధికారులు
బాధ్యత తీసుకుంటామని చిన్నకొడుకు, చిన్న కోడలు లిఖితపూర్వక హామీ
‘సాక్షి’ కథనానికి స్పందన

బుచ్చమ్మకు అండగా యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment