
కుంభాభిషేకానికి వేళాయె..
కాళేశ్వరం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహా ఘట్టం రానే వచ్చింది. 42ఏళ్ల అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్రంలోనే మొదటిసారి కాళేశ్వరం దేవస్థానంలో నిర్వహించడానికి రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆలయంతో పాటు గోదావరి నది వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నేటి (శుక్రవారం) నుంచి 9వ తేదీ (ఆదివారం) వరకు కాళేశ్వరం దేవస్థానంలో శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతితీర్థస్వామి వారి ఆశీస్సులతో తుని తపోవనం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానందసరస్వతితో మహాకుంభాభిషేకం నిర్వహణ చేయనున్నారు. ముఖ్యంగా శతచండి, మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేకం, కుంభాభిషేక మహోత్సవాన్ని ఆసిఫాబాద్ జిల్లా అచ్చలాపురం దుద్దిళ్ల మనోహరశర్మ ఆధ్వర్యంలో శిష్య బృందం 50మంది రుత్వికులతో నిర్వహిస్తారు. 1,180 కలశాలతో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు.
మూడు రోజులు ఆధ్యాత్మిక శోభ..
కాళేశ్వరంలో మూడు రోజుల పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. 42ఏళ్ల తరువాత నిర్వహిస్తుండడంతో తిలకించడానికి భక్తులు తరలిరానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో కాళేశ్వరంతో పాటు ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మికశోభతో వెలుగొందనున్నాయి. ఉచితంగా పులిహోర ప్రసాదం, అన్నదానం కార్యక్రమం చేస్తారు. ఇప్పటికే గోపురాలు, ఆలయాలకు పరంజాలతో మెట్ల మార్గాలు పూర్తిచేశారు. ఒక్కో గోపురం, ఆలయాల వద్ద 10నుంచి 12మంది వరకు సామర్థ్యంతో నిర్మాణం చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి సుమారు 50వేలకుపైగా భక్తజనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆదివారం 10.42గంటలకు ముహూర్తం..
ఆదివారం (9న) 10.42గంటలకు ముహూర్తం ప్రకారం శ్రీశ్రీశ్రీ సచ్చిదానందసరస్వతితో ప్రధాన ఆలయంపై గోపురం వద్ద ఆయన మహాకుంభాభిషేకం పూజ, ఇతర రుత్వికులు మిగతా గోపురాలు, ఆలయాల వద్ద సంప్రోక్షణ చేస్తారు. కుంభాభిషేకం పూజ వీక్షణకు నాలుగు ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. మహాకుంభాభిషేకం తరువాత భక్తుల ను దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కానీ వ చ్చే భక్తజనం రద్దీతో గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని అధికారులు పేర్కొంటున్నారు.
నేటినుంచి 9వ తేదీ వరకు మహాకుంభాభిషేక పూజలు
9న సచ్చిదానంద సరస్వతితో
నిర్వహణ
అచ్చలాపురం రుత్వికులతో
1,180 కలశాలకు పూజ నిర్వహణ
భక్తులకు అన్నదానం,
ఉచిత ప్రసాదానికి ఏర్పాట్లు
సర్వం సిద్ధం చేసిన దేవాదాయశాఖ అధికారులు
మూడు రోజులు కాళేశ్వరంలో
ఆధ్యాత్మిక సందడి

కుంభాభిషేకానికి వేళాయె..
Comments
Please login to add a commentAdd a comment