
నిట్‌లో ‘క్యూరా–25’ వేడుకలు షురూ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని రామన్ సెమినార్ హాల్‌లో రెండు రోజులపాటు జరిగే 14వ నేషనల్ లెవల్ మేనేజ్‌మెంట్ ఫెస్టివల్ ‘క్యూరా–25’ వేడుకలను శనివారం టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి కర్నాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ స్కూల్ విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకునే నూతన ఆవిష్కరణలకు వేదికగా ‘క్యూరా–25’ నిలవాలని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని వ్యాపార కేంద్రంగా చూస్తోందని, ఇందుకు తగ్గట్టుగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 120 మంది బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని, ఏడు రకాల పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరా స్టూడెంట్ కోఆర్డినేటర్ శర్ధిల్ తెలిపారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు వేణువినోద్, సునీత, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కిషన్ రెడ్డి రాక
హన్మకొండ: నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈనెల 16న హనుమకొండ పర్యటనకు వస్తున్నట్లు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి తెలిపారు. కిషన్‌రెడ్డి ఆదివారం ఉదయం 10.30 గంటలకు హనుమకొండకు చేరుకుని హంటర్ రోడ్‌లోని వేద ఫంక్షన్ హాల్‌లో జరిగే విలేకరుల సమావేశంలో పాల్గొంటారని, 11.30 గంటలకు సత్యం కన్వెన్షన్ హాల్‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఉద్యోగులు
బాధ్యతగా పని చేయాలి
కేయూ క్యాంపస్: ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. టీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్‌లో 10 మందిని కేయూకు కేటాయించగా ఎనిమిది మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాగా.. ఆరుగురికి వివిధ సెక్షన్లలో పోస్టింగ్‌లు ఇవ్వగా వారు విధుల్లో చేరారు. వారితో శనివారం అకడమిక్ కమిటీహాల్‌లో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. ఉద్యోగ విధుల నిర్వహణలో క్రమశిక్షణ, విధేయత అవసరమని, సర్వీస్ రూల్స్‌పై పట్టుసాఽధించాలని చెప్పారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు సీహెచ్.ప్రణయకుమార్, డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికతో చదివితే
అత్యుత్తమ ఫలితాలు
విద్యారణ్యపురి/హన్మకొండ: విద్యార్థులు ప్రణాళికతో చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని వడుప్సా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాల సతీష్‌కుమార్ అన్నారు. వడుప్సా ఆధ్వర్యాన శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవనంలో ప్రయివేట్ హైస్కూళ్లకు చెందిన పదో తరగతి విద్యార్థుల కు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు అనగానే భయపడొద్దని, సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించుకుని మోడల్ ప్రశ్నాపత్రాలను కూడా అనుసరించి సన్నద్ధం కావాలన్నారు. మోటివేషనల్ స్పీకర్ బారపాటి గోపి పలు సూచనలు చేశారు. జనరల్‌సెక్రటరీ విజ్ఞానేశ్వర్, కోశాధికారి వి.ముక్తేశ్వర్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాముల పరిశీలన
వరంగల్: సాధారణ తనిఖీల్లో భాగంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా గోదాములను కలెక్టర్ సత్య శారద, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి శనివారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూం గోదాములకు సంబంధించిన రికార్డులు, భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ ఇక్బాల్, నాయ బ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment