
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద
వరంగల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన సాగాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపుపై శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు చాలా కీలకమని పేర్కొన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాల ని, వారాంతపు పరీక్షలు, రివిజన్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఉదయం పిల్లలకు రాగి జావ, సాయంత్రం సైతం అల్పాహా రం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి
దేశాయిపేట: తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయ ని కలెక్టర్ సత్యశారద అభిప్రాయపడ్డారు. దేశాయిపేట ప్రభుత్వ పాఠశాల, ఎల్‌బీనగర్‌లోని మసూంఅలీ పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో కలెక్టర్ పాల్గొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం జిల్లా వ్యాప్తంగా 125 పాఠశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్ధులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి..
అధికారులు సమన్వయంతో పనిచేసి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని చెప్పారు. 9,237 మంది విద్యార్థులకు 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment