మాతృభాషకు ఓరుగల్లు మణిహారం..
భాషను విస్మరిస్తే తీవ్ర నష్టం..
మాతృభాష మాట్లాడే యువత సంఖ్య తగ్గిపోతోంది. దీనిని చూసి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు. కానీ ఒకజాతి సంస్కృతి ధ్వంసమవుతున్నదని వారికి తెలియడం లేదు. ఒక భాష అంతరిస్తే వారి సాహిత్యంతో పాటు, ఆ భాష మాట్లాడే జాతి కూడా అంతరించిపోతుంది.
ప్రొఫెసర్ భూక్య బాబురావు, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞానపీఠం
తెలుగు భాషను గుబాళింపజేసిన
ఓరుగల్లు సాహితీవేత్తలు..
కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని యావత్ ఆంధ్రాదేశాన్ని పాలించారు. దీంతో పాటు ఓరుగల్లు నాటి నుంచే సారస్వత రంగంలోనూ ప్రముఖపాత్ర వహించింది. కాకతి గణపతిదేవచక్రవర్తి ఆ స్థానాన్ని సందర్శించిన తర్వాతే తిక్కన సోమయాజీ మహాభారత రచన చేపట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 13వ శతాబ్దంలో పాలకుర్తిలో జన్మించిన సోమనాథుడు బసవపురాణాన్ని, 14వ శతాబ్దంలో పొతానామాత్యులు మహాభాగవతాన్ని రచించారు. ఎందరో కవులు పురాణాలను తెలుగులోకి అనువదించిన వారున్నారు. ఆధునిక కాలంలో రచనలు చేసిన వారిలో మాడపాటి హన్మంతరావు మొదటివారు. హన్మంతరావు 1911లో రాసిన నవనాగరికత మొదటికథగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత 1927లో వద్దిరాజు రాఘవ రంగారావు, వద్దిరాజు సీతారామచంద్రరావులు, పెండ్యాల రాఘవరావు, కాళోజీ నారాయణరావు, పి.వి. నరసింహారావు, పొట్లపల్లి రామారావు, దాశరథి రంగాచార్యులు, టి. హైయగ్రీవాచారి, బండారు చంద్రమౌళీశ్వరరావు, అడ్లూరి అయోధ్యరామయ్య, బిరుదురాజు రామరాజు, పెండ్యాల శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు, వాసుదేవరావు, తదితరులు కథలు రాశారు. ధూపాటివెంకటరమణాచార్యులు పి.వి. నరసింహారావు, కాళోజీ నారాయణరావు, బండారు సదాశివరావు, అంపశయ్య నవీన్ నుంచి ఇప్పటి వరకు రాస్తున్న కొత్త తరం కవిత్వం కథ నవల విమర్శనా రంగాల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. తెలుగుభాషను గుబాళింపజేస్తున్నారు. విజయవాడ తర్వాత తెలుగునాటకాన్ని రక్తికట్టించింది కూడా ఈ నేలపైనే. తెలుగులోనే పరిపాలన వ్యవహారాలు జరగాలని, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వెలువరించాలని, డిగ్రీలో కూడా తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలని, తెలుగు భాషను అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగుభాషోద్యమ సమాఖ్య ద్వారా కృషి చేశారు. ఓటరు వద్దకు వెళ్లి తెలుగులో ఓటు అడగడం తప్పు కానప్పుడు తెలుగులో పాలన వ్యవహరాలు ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. ఆచార్య పేర్వారం జగన్నాథం, వడుగు గోపాల్‌రావు, ఆచార్య హైమావతి తదితరులు తెలుగుభాష అభివృద్ధి కృషిచేశారు. 2012 తరువాత తెలుగుభాషోద్యమం కనుమరుగైంది.
తెలుగుభాషోద్యమ కేంద్రం ...
హనుమకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయానికి ఘనచరిత్ర ఉంది. నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. నిజాంల కాలంలో మొదట అధికార భాషగా పర్షియన్ ఉండేది. తర్వాత ఉర్దూ అధికార భాషగా స్థానం పొందింది. పాఠశాలలో ఉర్దూ మీడియంలోనే చెప్పేవారు. 90 శాతం ప్రజల మాతృ భాషగా ఉన్న తెలుగులో చదువుకునే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులలో నిజాం రాష్ట్రంలో పలుచోట్ల పౌరగ్రంథాలయాల స్థాపన ఉద్యమంగా జరిగింది. వీటిలో మొదటిది సెప్టెంబర్, 1, 1901లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం కాగా, రెండోది 1904 ఫిబ్రవరి 2 తేదీన శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయం కావడం విశేషం. ధూపాటి వెంకటరమణచార్యులు సేకరించిన ఎన్నో అమూల్య తాళపత్రగ్రంథాలు, శాసనాల అచ్చులు, పురాతన నాణెలు ఈ గ్రంథాలయంలోనే భద్రపరిచారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మహాకవి శ్రీశ్రీ, కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ, గుర్రం జాషువా వంటి ఎందరో విభిన్న సాహితీవేత్తలు ఇక్కడే ఉపన్యాసాలు ఇచ్చారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, జాతీయాచార్యులు బిరుదురాజు రామరాజు వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు. తెలంగాణలో తెలుగుభాషా ఉద్యమానికి కృషి చేసిన ప్రముఖ కేంద్రాల్లో భాషానిలయం కూడా ఒకటి కావడం మనకు గర్వకారణం.
– హన్మకొండ కల్చరల్
తెలుగు భాషను గుబాళింపజేసిన ఉమ్మడి జిల్లా సాహితీవేత్తలు
పుట్టిన ప్రతీ ఒక్కరిది మొదట మాతృభాషనే. వారి తల్లిదండ్రులు, చుట్టూ సమాజం పెంచి పెద్ద చేస్తుంది. తల్లిమీద గౌరవం ఎంత ఉంటుందో మాతృభాషపై కూడా అంతే గౌరవం ఉండాలి. అందుకే ఏ దేశస్తుడికై నా మాతృభాషపై మమకారం ఉండాలన్నది పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు సిద్ధాంతం. పూర్తిగా తెలుగు రానివారి గురించి బాధలేదు. కానీ తెలుగు రాయడం.. చదవడం వచ్చిన వారు కూడా భాష రాదని ఫోజు కొట్టడం చూసి కాళోజీ తీవ్రంగా మందలించేవారు. కాగా, శుక్రవారం(21వ తేదీ) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఇతర భాషల్లో ప్రావీణ్యం ఉండదు..
అమ్మ ఒడిలో ఉగ్గుపాలతో నేర్చుకున్న మాతృభాషలో విద్యను బోధించడం వల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మాతృభాష రానివారికి ఇతరభాషల్లోనూ ప్రావీణ్యం ఉండదు. ప్రతిఒక్కరూ మాతృభాషలో పండితుడు కావాల్సిన అవసరం లేదు. కనీసం అర్థం చేసుకోగలిగితే, మాట్లాడగలిగితే చాలు.
–రామారత్నమాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగువిభాగం, పింగిళి కళాశాల
ఏ భాషరా నీది? యేమి వేషమురా?
1942లో నిజాం రాష్ట్రంలో ప్రజలు తమ మాతృభాష తెలుగుపై నిరాదరణతో ఉండడం చూసి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు స్పందించారు. ఏ భాషరా నీది? యేమి వేషమురా? /ఈ భాష ఈవేష మెవరి కోసమురా?/ ఆంగ్లమందున మాటలాడ గలుగగనే/ ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు.
మాతృభాషకు ఓరుగల్లు మణిహారం..
మాతృభాషకు ఓరుగల్లు మణిహారం..
Comments
Please login to add a commentAdd a comment