ఐరన్, ఫోలిక్ మాత్రలతో ఎనీమియా నివారణ
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం : ఆరు నెలల వయస్సు పిల్లలనుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలందరికీ ఐరన్, ఫోలిక్ మాత్రలు పంపిణీ చేయడం ద్వారా ఎనీమియాను నివారించవచ్చని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అప్పయ్య.. ఫార్మసిస్టులకు సూచించారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎనీమియా ముక్త భారత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఫార్మసిస్టులకు సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ జిల్లాను ఎనీమియా రహితంగా మార్చేందుకు ప్రతీ ఆరోగ్య కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, జిల్లా ఎమినేషన్ అధికారి మహేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయ్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల, హెచ్‌ఈఈఓ చంద్రశేఖర్, డీడీఎం ప్రవీణ్, ఎంపీహెచ్‌ఓ రాజేశ్వర్‌రెడ్డి, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి
హజ్ యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడు తప్పకుండా వాక్సినేషన్ చేయించుకొని సర్టిఫికెట్ పొందాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో హజ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మొత్తం 53 మందికి గాను 47 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు.


