కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులు
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య
హన్మకొండ: పేదలను విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు పాలకులు సంపదను దోచిపెడుతున్నారని సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ధ్వజమెత్తారు. గత 20 రోజులుగా హనుమకొండ జిల్లాలో స్థానిక సమస్యలపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. వాహనంపై గుడిసె నమూనా వేసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. నిరసన కార్యక్రమంలో ఎస్.వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి జీవనం కొనసాగిస్తున్నా పట్టాలు ఇవ్వలేదన్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో కాలం వెళ్లబుచ్చింది తప్ప సమస్యలు పరిష్కరించలేదని దుయ్యబట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిని కలిసి సమస్యలతో కూడిన పత్రాలు అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, బొట్ల చక్రపాణి, రాగుల రమేష్, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, రాములు, తిరుపతి, లింగయ్య, భానునాయక్, నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులు


