కుల, మతాల పేరుతో బీజేపీ చిచ్చు
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హన్మకొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల, మతాల పేరుతో చిచ్చు పెడుతోందని రాష్ట్ర పంచా యతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ‘బునియాదీ కార్యకర్త సమ్మేళన్’ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీలపై దాడులు పెరిగాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుదలతో ముందుకెళ్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజు పాటు శిక్షణలో తెలుసుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరవేసి పార్టీని పటిష్టం చేయాలన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ బీఆర్‌ఎస్, ఆర్‌ఎస్ ఎస్ సిద్ధాంతాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకుడు విక్రాంత్ బునియా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు.


