బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను బహిష్కరించాలి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజీపేట: జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన రజతోత్సవ బహిరంగ సభను ప్రజలు బహిష్కరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాజీపేట చౌరస్తాలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సోమిడి రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలుగా విధ్వంసం చేసి ఉనికిలేకుండా చేసిన బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్‌ను నాలుగు దఫాలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ వెనుకబాటుతనానికి గురిచేశాడని విమర్శించారు. దోపిడీ ముఠా ఈ విషయంపై బహిరంగ చర్చకు వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ అంకూస్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.


