సజావుగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 179 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 22,624 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆమె వెల్లడించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
భూనిర్వాసితులతో సమావేశం..
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన పర్వతగిరి మండలం చింతనెక్కొండ, ఏనుగల్ గ్రామాల రైతులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయిందని తెలిపారు.


