గోధుమపిండి, విదేశాలలోనైతే బార్లీ, రై వంటి ధాన్యాల పిండితో చేసే వంటల్లో... ఉదా: మన రోటీలూ, పూరీలతో పాటు పాశ్చాత్యపద్ధతుల్లో చేసే బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్ల వంటివి తిన్నప్పుడు ‘సీలియాక్ డిసీజ్’ కారణంగా కొంతమందిలో కడుపునకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఆ ధాన్యాల పిండిలో ఉండే గ్లూటెన్ కారణంగా ఇలా జరుగుతుంది.
గ్లూటెన్ అంటే...?
పిండి కలపడానికి ముందుగా దాన్ని రాశిలా పోసి మధ్యలో గుంట చేసి అందులో కాసిన్ని నీళ్లు పోస్తాం కదా... ఆ పిండిని కలపడం మొదలుపెట్టగానే కాసేపట్లో అది ముద్దగా మారుతుంది. పిండిలో స్వాభావికంగా ఉండే జిగురులాంటి స్వభావాన్నిచ్చే ఓ ప్రోటీనే ఇలా పిండిముద్దలా మార్చేందుకు దోహదం చేస్తుంది. అదే ‘గ్లూటెన్’. కొందరికి ఇది సరిపడదు. గ్లూటెన్ సరిపడని స్వభావాన్నే ‘గ్లూటెన్ ఇన్ టాలరెన్స్’ అంటారు. (ఇలాంటివారి కోసం... గ్లూటెన్‌ను వేరుచేసి పిండిని తయారు చేస్తుంటారు. దీన్ని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అంటుంటారు. మరికొన్ని రకాల పిండి లో స్వాభావికంగానే గ్లూటెన్ ఉండదు. దాంతో వారికి ఏ ఇబ్బందీ ఉండదు).
ఆ ‘పిండి’వంటలు తింటే ఏమవుతుందంటే...
గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన పదార్థాలను తిన్నప్పుడు... అది సరిపడని కారణంగా చిన్నపేగుల కణాలు తీవ్రమైన రియాక్షన్‌ను చూపుతాయి. దాంతో చిన్నపేగుల్లోని ‘మైక్రోవిల్లై’ అనే భాగాలు దెబ్బతింటాయి. జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునే అవి దెబ్బతినడంతో... తిన్నవి ఒంటబట్టకపోవడం, దేహానికి శక్తి సమకూరకపోవడం, ఎముకలకు కావల్సినంత బలం దొరకకపోవడం, మహిళల్లో సంతానలేమి, గర్భస్రావాలు, కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. మొదట్లో సరిపడకపోయినా ఆ తర్వాత్తర్వాత నెమ్మదిగా జీర్ణవ్యవస్థ దానికి అలవాటు కావడం మొదలుపెడుతుంది. అలా జరగకపోతే చిన్నపేగులు/జీర్ణవ్యవస్థ దెబ్బతినడం మొదలై క్రమక్రమంగా అది సీలియాక్ డిసీజ్‌గా మారుతుంది. జీర్ణవ్యవస్థ గ్లూటెన్‌కు అలవాటు కాకపోవడంతో వచ్చే సమస్యను ‘రిఫ్రాక్టరీ లేదా నాన్ రెస్పాన్సివ్ సీలియాక్ డిసీజ్’గా చెబుతారు.
లక్షణాలు: సీలియాక్ డిసీజ్ కూడా ఒకరకమైన ఫుడ్ అలర్జీ లాంటిదే. అయితే దీని లక్షణాలు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. అవి...
►కడుపులో నొప్పి, గ్యాస్ నిండటంతో కడుపు ఉబ్బరం. దాంతో ఛాతీనొప్పి, ఛాతీలో / గుండెల్లో మంట ∙వికారం
►తలనొప్పి, ఒంటి మీద దురదతో కూడిన ర్యాష్ (దీన్ని డాక్టర్లు డెర్మటైటిస్ హెర్పెటోఫార్మిస్ అంటారు)
►కొందరిలో నోట్లో పుండ్లు
►రక్తహీనత
►కొందరిలో నీళ్ల విరేచనాలు / మరికొందరిలో మలబద్ధకం / దుర్వాసనతో కూడిన మలవిసర్జన
►తిన్నది ఒంటబట్టకపోవడంతో బరువు తగ్గడం.
దుష్ప్రభావాలు...
ఆహారం సరిగా ఒంటబట్టకపోవడంతో మరికొన్ని దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. అవి... కొందరిలో దంతాలపై ఎనామెల్ దెబ్బతినడం ∙చిన్న పిల్లల్లో (అబ్బాయిలూ, అమ్మాయిల్లో) పెరుగుదల కాస్త మందగించడం ∙కొందరిలో పాలు సరిపడకపోవడం (లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్) ∙ఎముకలు బలహీనంగా మారడం ∙అరుదుగా కొందరిలో నరాల సమస్య రావడంతో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ సరిగా తెలియకపోవడం, కాళ్లలో సమస్య తీవ్రంగా ఉంటే సరిగ్గా నిలబడలేకపోవడం వంటి సమస్యలు.
నిర్ధారణ:
- ఆటో ఇమ్యూన్ రుగ్మతలను తెలుసుకునే కొన్ని రకాల రక్తపరీక్షల (యాంటీబాడీస్ అన్వేషించే సీరాలజీ పరీక్షల)తో పాటు ఎర్ర రక్తకణాల సంఖ్యను తెలుసుకునేందుకు చేసే రక్తపరీక్షలు
- దేహంలో ఇన్‌ఫ్లమేషన్ ఉందని తేలినప్పుడు చేసే సీ–రియాక్టివ్ ప్రోటీన్ పరీక్ష
- కాలేయం పనితీరు కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’
- పేగుల్లోని ఫ్యాటీ యాసిడ్స్ తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు ∙విటమిన్–డి, విటమిన్ బి–12 ల మోతాదును తెలుసుకునే పరీక్షలు
- అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ
- పేగుల పరిస్థితిని తెలుసుకునే కొన్ని ఇమేజింగ్ పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి కొన్ని జన్యుపరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు.
డాక్టర్ ధీరజ్ కుమార్ అనుప, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్
(చదవండి: హషిమోటో థైరాయిడైటిస్ గురించి విన్నారా? ఎందువల్ల వస్తుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment