
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కొనసాగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా అందుకు ఆయన అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ స్థానంలో నియమించినప్పుడే.. శాసనసభ ఎన్నికల దాకే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్‌రెడ్డి నాయకత్వానికి చెప్పారని, అదీగాక ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరారని తెలిసింది.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పూర్తి సమయం కేటాయించాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కొనసాగాలని నాయకత్వం ఆయనకు నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల దాకా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.
మరో 3, 4 నెలల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధ్యక్షుడు కుదురుకోవడం సాధ్యం కాదని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో పాటు తెలంగాణ నుంచి అధిక సీట్లు (గతంలో గెలిచిన 4 సీట్ల కంటే ఎక్కువగా) గెలిచేందుకు అవకాశం ఉందన్న అంచనాల మధ్య కిషన్‌రెడ్డినే కొనసాగించాలని భావించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment