తరచూ చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ప్రతి సంవత్సరం సగటున 240 కోట్ల మంది కార్మికులపై పడుతోంది. దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తన నూతన నివేదికలో అందించింది. దీనిలోప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత, వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు.
ప్రపంచంలోని 71 శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. 2010లో ఇది 65.5 శాతంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు. 18,970 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో 2.62 కోట్ల మంది కార్మికులు ఉండవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది. అత్యధిక వేడి, వాయు కాలుష్యం మొదలైనవాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment