ఐదేళ్ల వయసు... ఆల్ఫాబెట్స్‌ను కూడా స్పష్టంగా పలకడం రాదు కొందరికి. కానీ ఆ వయసులో పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అంతేనా అందులోని బొమ్మలు సైతం తానే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 జనవరి 2022నాటికి ఆమె వయసు సరిగ్గా ఐదేళ్ల 211 రోజులు. జనవరిలో పబ్లిష్ అయితే... రికార్డుకు ఎందుకు లేటయ్యిందంటే... గిన్నిస్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా అది వెయ్యి కాపీలు అమ్ముడవ్వాలనేది సంస్థ నియమం.
యూకేలోని వేముత్‌లో 2016 జూలై 14న పుట్టిన బెల్లా జె డార్క్ పుస్తకం రాస్తానని చెప్పినప్పుడు పిల్ల చేష్టలు అనుకున్నారు వాళ్లు. 32 పేజీల పుస్తకం రాసి ముందు పెడితే షాకయ్యారు. పుస్తకాన్ని ఫెయిర్ చేయడంలో బెల్లాకు తల్లి చెల్సీ సైమ్ సహకరించింది. కథేంటంటే.. తల్లిదండ్రులు వెంట లేకుండా బయటికి వెళ్లిన బాలిక తనకు ప్రియమైన పిల్లిని పోగొట్టుకుంటుంది. అది పోయినందుకు ఆమె పడిన బాధ, వెంట ఎవరూ లేకుండా అలా వెళ్లకూడదన్న సందేశం ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పింది బెల్లా తల్లి చెల్సీ. సినిమాలకేనా పార్ట్ వన్, పార్ట్ టూలు... ద లాస్ట్ క్యాట్ 2 చదవడానికి సిద్ధంగా ఉండండంటున్నారు బెల్లా తల్లిదండ్రులు.
Comments
Please login to add a commentAdd a comment