వియాత్నంలోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేశ రజధాని హనోయిలోని 9 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరో 70 మందిని అధికారులు రక్షించారు.
మంగళవారం రాత్రి 11.30 గంటలకు భవనంలోని పార్కింగ్ ఏరియాలో మొదలైన మంటలు క్షణాల్లోనే అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్‌లో 45 కుటుంబాలు నివసిస్తుండగా ప్రమాద సమయంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న నివాసితులు తేరుకొని సాయం కోసం గట్టిగా కేకలు వేశారు.
అయితే అపార్ట్‌మెంట్ నుంచి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని, ఈ కారణంతోనే మరణాలు భారీగా సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
అయితే అపార్టమెంట్ ఇరుకైన గల్లీలో ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment