గ్రీస్‌లో పడవ మునక.. 79 మంది జలసమాధి | 78 Died After Boat With Refugees And Migrant Sinks Near Greece | Sakshi
Sakshi News home page

గ్రీస్‌లో పడవ మునక.. 79 మంది జలసమాధి

Published Wed, Jun 14 2023 8:38 PM | Last Updated on Thu, Jun 15 2023 9:00 AM

78 Died After Boat With Refugees And Migrant Sinks Near Greece - Sakshi

రక్షించిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

గ్రీస్: ఏథెన్స్‌: బతుకుదెరువు కోసం వలసపోతున్న డజన్లకొద్దీ శరణార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. దక్షిణగ్రీస్‌ సముద్రజలాల్లో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 79 మంది జలసమాధి అయ్యారు. డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. పెలోపోన్నీస్‌ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో మంగళవారం రాత్రివేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు. విషయం తెల్సుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాపాడిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.

78 మంది మరణించారని అధికారులు చెబుతున్నా ఇంకా ఎంతమంది మరణించి ఉంటారనేది తెలియట్లేదు. ఆరు తీర గస్తీ నౌకలు, ఒక నావికాదళ యుద్ధనౌక, ఒక సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ఇంకా కొన్ని ప్రైవేట్‌ పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. తూర్పు లిబియా దేశంలోని తోబ్రక్‌ ప్రాంతం నుంచి ఈ శరణార్థుల పడవ బయల్దేరి ఇటలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశానికి ఇలా ఒక వలసదారుల పడవ వస్తోందని ముందే  గ్రీక్‌ అధికారులకు ఇటలీ అధికారులు సమాచారం ఇచ్చారు. వలసదారులను కలామటా నౌకాశ్రయానికి తరలించి అక్కడ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రథమ చికిత్స అందించారు.

లిబియా అదుపులో వేలాది మంది శరణార్థులు
అక్రమంగా ఇలా ప్రయాణం సాగిస్తున్న వారిపై గతంలోనే లిబియా సర్కార్‌ తన అప్రమత్తతను కనబరిచింది. ఈజిప్ట్, పాకిస్తాన్, సిరియా, సూడాన్‌ తదితర దేశాలకు వేలాది మంది శరణార్థులు సముద్ర జలాల్లో అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుంది. ఈజిప్ట్‌కు చెందిన వారిని వెంటనే భూమార్గంలో తిరిగి వారి దేశానికి పంపేసింది. లిబియా దక్షిణ ప్రాంతంలో చూస్తే రాజధాని ట్రిపోలీసహా పలు ప్రాంతాల్లోని శరణార్థి హబ్‌లలో సోదాలు చేసి దాదాపు 1,800 మందిని అదుపులోకి తీసుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది. మధ్యధరా సముద్ర జలాల్లో స్థానిక తీర గస్తీ పెట్రోలియం దళాల కంటపడకుండా ఉండేందుకు చాలా మంది స్మగ్లర్లు పెద్ద సైజు పడవలను సమకూర్చుకుని అంతర్జాతీయ జలాల వెంట అక్రమంగా శరణార్థులను తరలిస్తున్నారు. ఆదివారం ఇదే మధ్యధరా సముద్ర జలాల్లో తమను కాపాడండంటూ అమెరికా తయారీ పడవలో వెళ్తున్న 90 మంది శరణార్థులు అత్యవసర సందేశం ఇచ్చారు.
 

ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement