పుతిన్ కళ్లలో ఆత్మ లేదు, అతడో కిల్లర్‌: బైడెన్‌ | America President Joe Biden Calls Vladimir Putin As Killer | Sakshi
Sakshi News home page

పుతిన్ కళ్లు చూశాను, అందులో ఆత్మ లేదు..‌

Published Fri, Mar 19 2021 7:56 AM | Last Updated on Fri, Mar 19 2021 10:31 AM

America President Joe Biden Calls Vladimir Putin As Killer - Sakshi

ఎవరి కళ్లు! ఎవరు చూశారు! పుతిన్‌ కళ్లు. బైడెన్‌ చూశారు. యూఎస్‌ ఎన్నికల్లో బైడెన్‌కి వ్యతిరేకంగా పుతిన్‌ క్రెమ్లిన్‌ నుంచి పావులు కదిపారని యూఎస్‌ ఇంటిలిజెన్స్‌ తాజా రిపోర్ట్‌!! బైడెన్‌ మండిపడుతున్నారు. ఎ.బి.సి. ఛానెల్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ నిన్న ప్రసారం అయింది. ‘పుతిన్, నువ్వేమిటో నాకు తెలుసు. నేనేమిటో నీకు తెలుసు. జరగబోయేదానికి సిద్ధంగా ఉండు’ అని హెచ్చరించారు.

ఆ సందర్భంగానే హోస్ట్‌ కి పుతిన్‌ కళ్ల గురించి చెప్పారు బైడెన్‌. ‘‘పుతిన్‌తో ఇటీవల ఫోన్‌ లో మాట్లాడినప్పుడు నేరుగా అతడితోనే అన్నాను.. ‘పుతిన్‌.. నీ కళ్లు చూశాను. వాటిల్లో ఆత్మ లేదు’ అని. అతడొక కిల్లర్‌’’ అన్నారు బైడెన్‌. సాధారణంగా ప్రెసిడెంట్‌లు, ప్రధానులు నేరుగా ఒకర్నొకరు అనుకోరు. వాళ్ల కుర్రాళ్ల చేత అనిపిస్తారు. బైడెన్, ట్రంప్‌ అలాక్కాదు. డైరెక్ట్‌ ఎటాక్‌. వీరిలా డైరెక్టుగా కాకుండా చాటుగా సాటి పెద్ద మనుషులను కామెంట్‌ చేసిన దేశాధినేతలూ ఉన్నారు. వాళ్ల ’స్మాల్‌ టాక్‌’పై చిన్న స్టోరీ. 

సూట్స్‌ వేసుకుని, బూట్లు తొడుక్కుని, ‘టై’లు కట్టుకుని కనిపించే దేశాధ్యక్షులు, దేశ ప్రధానుల మాటలు కూడా సూటు, బూటు వేసుకున్నట్లే ఉంటాయి. ‘యూ షటప్‌’ అనే మాటను కూడా దౌత్య పరిమితులకు లోబడే మర్యాదపూర్వకమైన పదబంధాలతో సంధిస్తారు. అయితే అమెరికన్‌ అధ్యక్షులలో బహుశా డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్కరే ఇంతవరకు తన సమఉజ్జీలతో గిల్లి, గిచ్చినట్లుగా మాట్లాడిన మనిషి కావచ్చు. తను ఉన్న నాలుగేళ్లూ ఆయన ఒక అధ్యక్షుడిగా లేరు. ఒక ఆటలా అమెరికాను పరిపాలించారు. కోపం వచ్చినప్పుడు కామన్‌మేన్‌లా కళ్లెర్ర చేశారు. కోపం తట్టుకోలేక పోయినప్పుడు అవతలి వారు దేశాధినేతలని కూడా చూడకుండా నోటికి ఎంతొస్తే అంత అన్నారు. జో బైడెన్‌ కొంచెం మెరుగని అనుకున్నాం కానీ, కోపం వస్తే బైడెన్‌ కూడా అంతేనని బుధవారం ఎ.బి.సి. న్యూస్‌ ఛానెల్‌లో ప్రసారమైన ఆయన ఇంటర్వ్యూతో బహిర్గతం అయింది. 

ట్రంప్‌ని గెలిపించడానికి (అంటే.. బైడెన్‌ను ఓడించడానికి) మొన్నటి నవంబర్‌ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ క్రెమ్లిన్‌ భవనం నుంచి వ్యూహాలు పన్నినట్లు అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అందించిన తాజా రహస్య నివేదిక గురించి ఇంటర్వ్యూలో హోస్ట్‌ ప్రస్తావించగానే పుతిన్‌పై బైడెన్‌ కోపం తారస్థాయికి చేరింది. ‘‘నువ్వేంటో నాకు తెలుసు. నేనేంటో నీకు తెలుసు. జరగబోయేవాటికి సిద్ధంగా ఉండు’’ అని పుతిన్‌ని హెచ్చరించారు! అక్కడితో ఆగలేదు. తను అధ్యక్షుడు అయ్యాక పుతిన్‌తో ఏం మాట్లాడిందీ టీవీ హోస్ట్‌కు చెప్పారు. ‘‘ఫోన్‌ లో చాలాసేపు మాట్లాడాను. ‘పుతిన్‌ నీ కళ్లు చూశాను. వాటిల్లో ఆత్మ లేదు’ అని ఆయనతో నేరుగానే చెప్పాను. కిల్లర్‌ అతడు. త్వరలోనే పుతిన్‌ చేసిన దానికి రష్యా అనుభవించబోతోంది’’ అని బైడెన్‌ అన్నారు. ట్రంప్‌ అనే మాటలతో పోలిస్తే ఇవేమీ ఘోరమైనవీ, నేరమైనవీ కావు. దౌత్యపరమైన తూటాలు మాత్రమే. దౌత్యం తప్పిన మాటలు వేరేవి ఉంటాయి. సాధారణం గా అవి బయటికి రావు. దేశాధినేతల వ్యక్తిగత భోజన కార్యక్రమాలలో వారికి అత్యంత సమీపంగా ఉండే కొందరు జర్నలిస్టుల మాటల్లో ఎప్పుడైనా కొన్ని బయటికి వస్తుంటాయి. అప్పుడనిపిస్తుంది. వాళ్లూ ‘సామాన్య’ పౌరులేనని!

బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో 2019 డిసెంబర్‌ 3న ప్రపంచ దేశాధినేతలకు లంచ్‌ ఏర్పాటయింది. వాళ్లంతా ‘నాటో’ సదస్సు లో పాల్గొనడానికి లండన్‌ వచ్చారు. వాళ్ల ప్రతి అడుగు, ప్రతి మాటా రికార్డ్‌ అవుతుందని తెలిసినా భోజనాల బల్ల దగ్గర ఆ సంగతి మర్చిపోయినట్లున్నారు. ‘‘నేను గమనిస్తూ ఉన్నాను కదా.. అతడికి, అతడి టీమ్‌కి దవడలు నేల మీదకు జారిపోయాయి’’ అన్నారు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పెద్దగా నవ్వుతూ.. తన పక్కనున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మ్యాక్రాన్, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లతో! ఆ మాటకు వాళ్లూ నవ్వారు. దవడలు నేలపైకి జారడం అంటే ఆశ్చర్యంతో నోరు తెరుచుకోవడం. అతడు అన్నది ట్రంప్, ఆయన సహచరుల గురించే! రికార్డు అయిన ఆ క్లిప్‌లో ట్రంప్‌ పేరెత్తకుండా ‘ఎలిఫెంట్‌’ అని అన్నారు జస్టిన్‌. ఆ సంగతిని అక్కడే ఉన్న ట్రంప్‌ పసిగట్టారు. రిపబ్లికన్‌ పార్టీ గుర్తు ఏనుగు అయినందువల్లనో, లేదంటే ట్రంపే ఏనుగులా ఉంటారనో.. మొత్తానికి జస్టిన్‌ చేసిన ‘స్మాల్‌ టాక్‌’ అది. స్మాల్‌ టాక్‌ అంటే తమ స్థాయిని మరచి చవకబారుగా మాట్లాడ్డం. జస్టిన్‌ ట్రూడో కు జెంటిల్మన్‌ అని బయట పేరు. 

రెండోరోజు అతడితో జరగవలసి ఉన్న సమావేశాన్ని ట్రంప్‌ ఆఖరి నిముషంలో రద్దు చేసుకున్నారు. ‘‘ఎందుకు రద్దు చేసుకున్నారు?’’ అని రిపోర్టర్లు అడిగారు. ‘‘కెనడా ప్రధాని రెండు ముఖాలు గల వ్యక్తి కనుక..’’ అని చెప్పారు ట్రంప్‌. ‘‘నాటో రక్షణ వ్యవస్థకు ఖర్చుపెట్టడం లో కెనడా మరీ పిసినారితనంతో వ్యవహరిస్తోంది’’ అని కూడా అన్నారు. ఆ తర్వాత ‘రెండు ముఖాలు’ అనే మాటను తను సరదాగా అన్నానని చెప్పారు. ఆ సంగతి గురించి రాస్తూ.. ‘‘³ద్ద పెద్ద ఇగోలు ఉండే చిన్న చిన్న మనుషులు ఈ దేశాధినేతలు’’ అని వ్యాఖ్యానించారు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో విదేశీ వ్యవహారాలను విశ్లేషిస్తుండే పాత్రికేయుడు ఆడమ్‌ టేలర్‌.

మైక్‌ ఆపి మాట్లాడితే ఎవరికీ తెలియదని అనుకుంటారు కానీ, మన ప్రపంచ దేశాల అధిపతులు ఏ చిన్న తొందరపాటు దగ్గరో పట్టుబడిపోతుంటారు. 1988 లో బెల్జియంలో జరిగిన ఐరోపా సమావేశంలో ఫ్రాన్స్‌ ప్రధాని జాక్వెస్‌ చిరాక్, బ్రిటన్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ఉన్నారు. మీటింగ్‌ విఫలం అయింది. మర్నాడు సమావేశం కొనసాగింపు. డిన్నర్‌ టైమ్‌లో వీళ్లిద్దరే ఉన్నప్పుడు జాక్వెస్‌ చిరాక్‌.. థాచర్‌తో..‘ఈ గృహిణి నా నుంచీ ఇంకా ఏం కోరుకుంటోంది? ‘మై బాల్స్‌ ఆన్‌ ఎ ప్లేట్‌?’ అన్నట్లు రికార్డ్‌ అయింది. నిజానికి ఆ మాటను ఫుట్‌బాల్‌ గేమ్‌లో వాడతారు. అవతలి ప్లేయర్‌కి స్కోరింగ్‌ చాన్స్‌ ఇవ్వడం. ఇక్కడ చిరాక్‌ కూడా అలానే వాడారు.. ‘మేము నష్టపోవడం ద్వారా మీకు ప్రయోజనం కలిగించాలా..’ అని.

అయితే ఆ మాటను అన్నది ఒక స్త్రీతో కనుక విపరీతార్థానికి కారణం అయింది. మరొక ఫ్రాన్స్‌ నాయకుడు (అధ్యక్షుడు) నికోలాస్‌ సర్కోజీ 2011లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మాట్లాడుతూ ‘‘అతడిని నేను భరించలేను. అతడొక అబద్ధాల కోరు’’ అని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యహూ గురించి అన్నమాట ఫ్రాన్స్‌ టీవీలకు, వెబ్‌సైట్‌లకు పొక్కి అక్కడి నుంచి ప్రపంచానికంతటికీ తెలిసింది. అంతకంటే పెద్ద మాట.. ‘‘నేను నీకంటే ఎక్కువగా అతడిని భరిస్తున్నాను’’ అని ఒబామా అనడం. తన మాట బయటికి రావడంతో ఒబామా చాలా పశ్చాత్తాపానికి గురయ్యారు. అయితే అమెరికా అధ్యక్షులంతా ఒబామా అంత సున్నితంగా ఉండరేమో. 1971లో రిచర్డ్‌ నిక్సన్‌ కెనడా ప్రధాని పియరీ ట్రూడో (జస్టిన్‌ ట్రూడో తండ్రి) ను ‘పాంపస్‌ ఎగ్‌హెడ్‌’ అన్నారు! కోడి బుర్ర అని.

అలా అన్నాడని తెలిసి పియరీ ఏమీ విలవిల్లాడిపోలేదు. ‘‘మంచి మనుషులు మాట్లాడిన చెడ్డమాట’’ అని మాత్రం అన్నారు. 1980లలో రీగన్, థాచర్‌ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేదనే మాట వినిపిస్తుండేది. అయినప్పటికీ వాళ్లెప్పుడూ చాటున ఒకర్నొకరు నిందించుకోకుండా ఉండేవారు కాదని ఆడమ్‌ టేలర్‌ రాశారు. ‘‘రీగన్‌ని థాచర్‌ అన్న మాటలు బయటికి వస్తే ఆంగ్లో అమెరికన్‌ సంబంధాలు దెబ్బతినడం ఖాయమని వాషింగ్టన్‌లో బ్రిటన్‌ రాయబారిగా పని చేసిన నికోలాస్‌ హెండర్సన్‌ ఒక సందర్భంలో అన్నారట. ఏమైనా పెద్దవాళ్ల ఈ చిన్నమాటలు పెద్దగా తీసుకోదగినవి కాదు. నవ్వుకోడానికీ, ‘ఔనా!’ అని ఆశ్చర్యపోవడానికే.

చదవండి: కమల హారిస్‌ ఇంటి ముందు కలకలం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement