
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.
అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా,విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ (anti-corruption commission) ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఏసీసీ నివేదిక ప్రకారం.. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment