లండన్: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్‌లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్ టెంప్టింగ్‌గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్ చేసి.. ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగం కోసం, మీకు ప్రత్యేక ప్రతిభ ఉండాలి. (చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు)
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు, బిస్కెట్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఇది మాత్రమే కాక, నాయకత్వ నైపుణ్యాలు, సమాచార మార్పిడిలో మంచి అవగాహన ఉండాలి. దాంతో పాటు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. బేకరీ ఉత్పత్తులు, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వంటి ఐటి నైపుణ్యాలు ఉండాలని తెలిపారు. వీటితో పాటు యూకే చట్టాలు, సాంకేతికత, పరిశ్రమ సంకేతాల గురించి తగిన అవగాహన ఉన్న వ్యక్తి అవసరం అని కంపెనీ తెలిపింది. సెలక్టయిన వ్యక్తికి సంవత్సరానికి 35 రోజుల సెలవు, బోనస్ పథకం, 1000 కి పైగా రిటైలర్లలో డిస్కౌంట్, ఉచిత ఆన్‌లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment