టొరంటో: కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో వెలుపల జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కెనడియన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు దుండగులు చోరీ చేసిన వాహనంలో ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. అనంతరం స్టూడియో వెలుపల కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కేసులో కెనడా పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు నిఘా సారించాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పలువురు పంజాబీ గాయకుల ఇళ్లు ఉన్నాయి. అలాగే వారి మ్యూజిక్ స్టూడియోలు కూడా ఉన్నాయి.
ఈ కాల్పుల ఘటనకు ముందుదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొందరు పాటలు ప్లే చేస్తూ, ఆయుధాలతో నృత్యం చేయడం కనిపిస్తోంది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందని, కెనడియన్ మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో దుండగులు దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.
ఇదిలావుండగా ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ. ధిల్లాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగాయి. కెనడాలోని వాంకోవర్‌లో గల అతని ఇంటి వెలుపల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికిముందు కెనడాలోని ప్రముఖ పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కూడా కాల్పులు జరిగాయి.
ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment