
విశ్వాసానికి మారుపేరు శునకం. అందుకే చాలా మంది జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది అయితే వాటిని కుటుంబ సభ్యులుగానే భావిస్తూ.. ప్రత్యేకంగా గదిని కేటాయించడం సహా ఇళ్లంతా హాయిగా తిరిగేలా స్వేచ్చనిస్తారు. వాటి ఆకలిదప్పుల్ని తీరుస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే ఒక్కోసారి సమయానికి ఆహారం పెట్టడం మర్చిపోయారే అనుకోండి.. పరిస్థితి ఇదిగో ఈ వీడియోలో చూపించినట్లు ఉంటుంది. ఆకలికి తాళలేక ఓ గోల్టెన్ రిట్రీవర్ డాగ్ కిచెన్‌లోకి దూరింది. ఎలాగోలా కష్టపడి టేబుల్‌పై ఉన్న ఫుడ్ కంటేనర్‌ను నోటకరచుకుంది. అయితే అంతలోనే యజమాని రావడంతో పాపం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. (అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపాడు)
‘‘నో!! ఏం చేస్తున్నావు? ఇప్పుడు నిన్ను చూసేశాను!’’ అని కాస్త గొంతు పెద్దది చేసి అరవడంతో బిక్కముఖం వేసింది. చేసిన పనికి యజమాని కళ్లల్లోకి సూటిగా చూడలేక.. నోట్లో ఉన్న బాక్స్‌ను కిందపడేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్యూట్ వీడియో పెట్‌లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ గోల్డెన్ రిట్రీవర్ చేష్టలు చూసినవారంతా తమ ఇంట్లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయని, వీడైతే బాక్స్ వదిలేసి వెళ్లాడు గానీ, మా లాబ్రడార్ మాత్రం ఇంట్లో ఉన్న తినుబండారాలన్నీ ఖాళీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం చేసి పట్టుబడిన వాడిలా వాడు చూస్తున్న బేళ చూపులు చూసైనా తిట్టడం ఆపేయాల్సింది అంటూ జాలి చూపిస్తున్నారు.(అంతా చేసి అమాయకుడిలా ఆ ఫేసు చూడు )
Comments
Please login to add a commentAdd a comment