విజన్ 2030ను సృష్టించుకుని.. ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా మార్చుకునేందుకు సాంకేతికతను సైతం అలవర్చుకుంది సౌదీ అరేబియా. అయితే ఆ సాంకేతికతే నేరాలు-ఘోరాలకు.. అందునా మహిళలపై అఘాయిత్యాలకు కారణమైతే ఎలా?.. తాజాగా అక్కడ జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట ఇంతటి విపరీతమైన చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా?..
ముహమ్మద్.. ఇప్పుడు ఈ పేరు అక్కడి వార్తల్లో నిలిచింది. అలాగని అది మనిషి కాదు.. సౌదీ అరేబియా తొలి మగ రోబో(ఆండ్రాయిడ్). ఆ మగ రోబో ఓ మహిళా రిపోర్టర్‌ను అసభ్యంగా తాకబోయిందట!. అంతే.. టెక్నాలజీ భద్రమేనా? అనేది ఒక చర్చ అయితే.. లైంగిక వేధింపులను ఏమాత్రం తేలికగా తీసుకోని ఆ దేశంలో ఇలాంటి ఘటనని ఉపేక్షించొచ్చా? అనే కోణంలో మరో చర్చా నడవడం గమనార్హం.
ఓ లైవ్ ఈవెంట్ జరుగుతున్న టైంలో.. రిపోర్టర్‌ను తాకేందుకు రోబో ప్రయత్నించిందట. వెంటనే అప్రమత్తమైన రిపోర్టర్ రావియా అల్ ఖ్వాసిమీ తన చెయ్యి అడ్డుపెట్టింది. కేవలం 8 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#UNUSUAL : In Saudi Arabia, a robot harassed a TV presenter during a live broadcast.
— upuknews (@upuknews1) March 7, 2024
Apparently there was a glitch in the robot's programming.#SaudiArabia #Robot #TVpresenter pic.twitter.com/qdF5Ye9YTe
ఈ వీడియోపై మామూలు చర్చ జరగడం లేదు. ఆ రోబో చర్య లైంగిక వేధింపుల కిందకే వస్తుందని వాదిస్తున్నారు కొందరు. దీనికి తోడు ఆ రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలవ్వడం ఆ వాదనకు మరింత బలం చేకూరుస్తుందన్నది మరికొందరి వాదన. అందుకే శిక్షగా.. దానిని శాశ్వతంగా నిషేధించాలని కోరుతున్నారు. ఇక ఇంకొందరు మాత్రం.. ముహమ్మద్ అమాయకుడని.. ఆ రోబోకు జరిగిన ప్రొగ్రామింగ్.. ఆ ప్రొగ్రామింగ్‌ను ఇచ్చిన తప్పంతా అంటూ రోబోను వెనకేసుకొస్తున్నారు. సరదా కామెంట్లు చేసేవాళ్ల సంగతి సరేసరి.
సౌదీ అరేబియాలో ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల్లాంటి వాటిల్లో ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల సౌదీ రియాల్(మన కరెన్సీలో కోటి 70 లక్షలకు పైనే)జరిమానా విధిస్తారు
సౌదీ అరేబియా తొలి మహిళా ఆండ్రాయిడ్ రోబో సారా. ఈ ఘటన జరిగిన సమయంలో సారా కూడా ఆ పక్కనే ఉంది. క్యూఎస్‌ఎస్ సిస్టమ్స్ అనే సంస్థ ముహమ్మద్ అనే రోబోను రూపొందించింది. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీలో సౌదీ అరేబియా సాధించిన పురోగతిని వివరించేందుకే ఈ రోబోను రూపొందించడం గమనార్హం. జనాలకు తనను తాను పరిచయం చేసుకునేందుకు దానికి ప్రోగ్రామింగ్ చేశారు. ఈ క్రమంలోనే అది తన చెయ్యిని ఆడిస్తూ ఉంది అంతే!. అయినా రోబో ఎక్కడైనా కావాలని వేధిస్తుందా? ఏంటి? అని అడిగేవాళ్లూ లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment