దుబాయ్‌కి క్యూ కడుతున్న భారతీయులు.. అక్కడ ఇళ్లకు ఫుల్ డిమాండ్.. | Dubai Real Estate Earned Rs 35500 Crore Sales To Indians In 2022 | Sakshi
Sakshi News home page

డబ్బు ఉందా?.. దుబాయ్‌లో మంచి ఇల్లు.. బోలెడు రెంటు.. ఆపై గోల్డెన్ వీసా..

Published Sun, Feb 5 2023 4:32 PM | Last Updated on Sun, Feb 5 2023 5:27 PM

Dubai Real Estate Earned Rs 35500 Crore Sales To Indians In 2022 - Sakshi

దుబాయ్‌.. ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటి. బడా వ్యాపారవేత్తలకు స్వర్గధామం. లగ్జరీ లైఫ్ స్టైల్‌కు, సంపన్నులకు నిలయం. పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ప్రాంతం. ఆకాశాన్ని తాకినట్లు ఉండే భవనాలు, స్కైస్క్రాపర్లు, బుర్జ్ ఖలీఫా ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు.

అందుకే ఇక్కడ నివసించేందుకు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్‌లో స్థిరపడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ రూ.కోట్లు పెట్టి ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు.  దుబాయ్ రియల్ ఎస్టేట్ గణాంకాల ప్రకారం 2022లో వారికి 16 బిలియన్ దిర్హాంలు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.35,500 కోట్లు ఆదాయం భారతీయుల వల్లే వచ్చిందంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021తో పోల్చితే(9 బిలియన్ దిర్హాంలు..) ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.

ముంబైలో అద్దెతో సమానం..
దుబాయ్‌లో ఖరీదైన ఇళ్లు కొనేవారిలో 40 శాతం మంది భారతీయులే ఉంటున్నారు.  ప్రత్యేకించి ఢిల్లీ-ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్‌కు చెందిన వారే దుబాయ్‌లో ఎక్కువగా ఇళ్లు కొంటున్నారు. వీరితో పాటు యూఏఈలో నివసించే భారతీయులు, విదేశాల్లోని భారతీయులు కూడా దుబాయ్‌లో ఇల్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొనేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తికనబర్చడానికి ప్రపంచంతో ఈ నగరానికి ఉన్న కనెక్టివిటీనే ప్రధాన కారణమని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. భారతీయ సంపన్నులు నెలకు రూ.లక్షలు చెల్లించి దుబాయ్‌లో ఇళ్లు అద్దెకు కూడా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో 30 శాతం క్షీణించిన రెంటల్ మార్కెట్ ఇప్పుడు మళ్లీ పుంజుకొని 2015-16 స్థాయికి చేరుకుందని వివరించారు.

వ్యాపారసంస్థలకు దుబాయ్‌లో అత్యంత అనువైన వాతావరణం ఉందని, హైదరాబాద్‌, లండన్ నుంచి ఈ నగరానికి సులభంగా ప్రయాణించవచ్చని జేవీ వెంచర్స్ కో-ఫౌండర్ విశాల్ గోయల్ చెప్పారు. తన భార్య కూడా ఫిన్‌టెక్ వెంచర్‌ను దుబాయ్‌లోనే ప్రారంభించిందని వివరించారు.

దుబాయ్‌లో మంచి ఇళ్లు కొనాలంటే 1.6-1.7 మిలియన్ల దిర్హాంలు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.3.6 కోట్ల నుంచి రూ.3.8 కోట్లు అవుతుంది. ఒకవేళ మంచి అద్దె ఇల్లు కావాలంటే రూ. 3-3.5 లక్షలు అవుతుంది. ఇక్కడ రెంట్లు భారత్‌లోని ముంబయితో పోల్చితే నాలుగైదు శాతం మాత్రమే అటు ఇటుగా ఉంటాయని స్థానిక రియల్టర్లు చెబుతున్నారు.

గోల్డెన్ వీసా ప్రోగ్రామ్..
ఎక్కవ మంది కార్మికులు, నైపుణ్యం గల నిపుణులు, పరిశోధకుల కోసం గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను విస్తరించడం కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల వీసా వల్ల  విదేశీయులు యూఏఈలో నివసిస్తూ  పని చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు. వీరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. విదేశీయుల నుంచి డిమాండ్ బాగా ఉండటంతో దుబాయ్‌లో అపార్ట్‌మెంట్‌లు, విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోందని అక్కడి రియల్టర్లు వివరించారు. 

దుబాయ్‌లోని భారతీయ పాఠ్యాంశాలతో కూడిన స్కూళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనవని, తన పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి దుబాయ్‌లో స్థిరపడ్డ వ్యాపారవేత్త రాహుల్ భట్టాడ్ చెప్పారు. ఈ నగరం అత్యంత సురక్షితమైందని,  క్యాబ్‌లో బ్యాగ్‌ని మర్చిపోయినా, డ్రైవర్ మిమ్మల్ని ట్రాక్ చేసి తిరిగి ఇస్తాడని చెప్పారు. తన వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈ ఆధునిక నగరాన్ని చూసి ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు.
చదవండి: మోస్ట్‌ ఫ్యూచరిస్టిక్‌ హోటల్‌ ఇన్‌ ది వరల్డ్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement