
UK's First Indoor Beach: బీచ్ అనగానే విశాలమైన సముద్రం, నేలపై పరుచుకున్న ఇసుక తిన్నెలు, అప్పుడప్పుడు వచ్చిపోయే అలలు కళ్లముందు కనిపిస్తుంటాయి. మరి ఇలాంటివన్నీ బయట కాకుండా ఓ బిల్డింగ్ లాంటి ప్రదేశం లోపల ఇమిడిపోతే. అంటే ఇండోర్‌లోకి వచ్చేస్తే! బ్రిటన్‌లో అచ్చం ఇలాగే ఇండోర్ బీచ్ ఒకటి సిద్ధమవుతోంది. ఒక్క బీచ్ మాత్రమే కాదు.. మినరల్ బాత్‌లు, స్టీమ్ రూమ్‌లు, వేడి నీటి బుగ్గలు.. అబ్బో చూడముచ్చటైన చాలా అందాలు జతకూడనున్నాయి. ఈ బీచ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందామా.
బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో..
బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ బీచ్‌కు ‘థర్మ్ మాంచెస్టర్’ అని పేరు పెట్టారు. దీన్ని దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. 2023 నాటి కల్లా సిద్ధమవ్వాల్సి ఉన్నా మరిన్ని ప్రత్యేక వసతులను జత చేసి 2025 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నా రు. ఏటా 20 లక్షల మంది ఈ బీచ్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.
28 ఎకరాల వైశాల్యంలో..
బీచ్‌ను 28 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అంటే 19 ఫుట్ బాల్ పిచ్‌ల వైశాల్యమంత ఉంటుంది. ఇందులో ఇండోర్, ఔట్‌డోర్ పూల్స్, 35 వాటర్ స్లైడ్స్, స్టీమ్ రూమ్స్, విశ్రాంతి తీసుకోవడానికి తాటి చెట్లు ఏర్పాటు చేయనున్నారు. రోజా పువ్వు ఆకారంలో వెల్ బీయింగ్ గార్డెన్‌ను రెండెకరాల్లో రెడీ చేయనున్నారు. వందలాది చెట్లు, మొక్కలను పెంచనున్నారు. పెద్దల కోసం వేడి నీటి బుగ్గలు (వార్మ్ వాటర్ లగూన్స్), మినరల్ బాత్, స్టీమ్ రూమ్స్ సిద్ధం చేయనున్నారు.
పైగా.. బార్లు, కేఫ్‌లు, స్నాక్స్ అందించే రెస్టారెంట్లు కూడా ఉంటాయి. విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోజువారి నీటి సంబంధమైన ఫిట్‌నెస్ క్లాసులు, యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment