వాషింగ్టన్: అమెరికాలో సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో ప్రధాన నిందితుడైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏడుగురు మహిళలు, ఐదుగురు పురుషులతో కూడిన జ్యూరీ మూడువారాల పాటు విచారణ జరిపి మూడు కేసుల్లో అతడిని దోషిగా నిర్దారించింది. సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, ఊపిరాడకుండా చేసి చంపేయడం వంటి నేరాలు నిరూపితమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో, హెనెపిన్ కౌంటీ జడ్జీ పీటర్ చాహిల్, డెరెక్‌ను దోషిగా తేలుస్తూ ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. కాగా స్థానిక చట్టాల ప్రకారం అతడికి 40 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ తీర్పు కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న జార్జ్ ఫ్లాయిడ్ మద్దతుదారులు, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడే వారు కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్లాయిడ్ సోదరుడు సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ... ‘ఈ క్షణం తను జీవించిలేకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ నాలోనే ఉంటాడు’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ తీర్పు తమలాంటి ఎంతో మంది బాధితులకు ఊరటనిస్తుందని పేర్కొన్నాడు. కాగా గతేడాది మే 25న మినియాపోలిస్‌లో డెరెక్ చౌవిన్ అనే శ్వేతజాతీయ పోలీస్, ఆఫ్రో- అమెరికన్ జార్జ్‌ను అరెస్ట్ చేసే క్రమంలో అతడి గొంతుపై గొంతుపై మోకాలితో తొక్కిపెట్టగా, ఊపిరి ఆడక మరణించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో జార్జ్ ప్లాయిడ్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో, అగ్రరాజ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. జార్జ్ మృతికి కారణమైన చౌవిన్‌ను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదు కాగా బెయిలుపై విడుదలయ్యారు. అయితే, ప్రధాన నిందితుడైన డెరెక్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రాంగణంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment