సాక్షి, హైదరాబాద్: గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి గ్రీన్ టీ, కాఫీలు మేలు చేస్తాయని గుర్తించారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతుల్లోనూ ఈ రెండూ గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడతాయని వీరు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. 40 నుంచి 79 ఏళ్ల వయసున్న సుమారు 46 వేల మందిపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధన నిర్వహించింది. జపాన్‌లోని 45 సమూహాల్లోని వీరి నుంచి జీవనశైలి, నివసించే ప్రాంతం, తీసుకునే ఆహారం వంటి వివరాలు సేకరించారు. గుండెపోటు నుంచి కోలుకున్న వారిని ఒక వర్గంగా, గుండెజబ్బులున్న వారిని ఇంకో వర్గంగా, ఈ రెండూ లేని వారిని మూడో వర్గంగానూ విభజించి గ్రీన్ టీ, కాఫీ అలవాట్లను పరిశీలించారు.
గుండెపోటు నుంచి కోలుకుని.. రోజుకు 7 కప్పుల గ్రీన్ టీ తీసుకునే వారు.. అరుదుగా గ్రీన్ టీ తీసుకునే వారితో పోలిస్తే మరణించేందుకున్న అవకాశం 62 శాతం వరకూ తగ్గినట్లు గుర్తించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజుకో కప్పు కాఫీ తాగినా.. కాఫీ తాగని వారితో పోలిస్తే మరణించే అవకాశం 22 శాతం తగ్గింది. గుండెపోటు, జబ్బుల్లేని వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే కాఫీ అస్సలు తాగని వారితో పోలి్చనప్పుడు మరణించే అవకాశం 14 శాతం వరకు తగ్గినట్లు ఈ అధ్యయనం గుర్తించింది. మొత్తంగా గుండెజబ్బులు, పోటు నుంచి కోలుకున్న వారికి మళ్లీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా గ్రీన్ టీ, కాఫీలు అడ్డుకుంటాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment