జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే.
ఇదే సమయంలో బందీలను విడుదల చేయకపోవడంతో గాజాపై తమ సైన్యాలు దాడికి దిగడానికి సద్ధమవుతున్నాయని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి తర్వాత 17 మందిని విడుదల చేసింది. ఈజిప్ట్ వైపున్న రఫా సరిహద్దుల్లో వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా, మరో నలుగురు థాయ్ జాతీయులు. అందులో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, టీనేజర్లు ఉన్నారని అధికారులు చెప్పారు. వారిని ఇజ్రాయెల్‌లోని దవాఖానల్లో చేర్చినట్లు వెల్లడించారు. కాగా, ఒప్పందంలో భాగంగా తన వద్ద బందీగా ఉన్న 42 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. తొలివిడుతలో 24 మంది బందీలను హమాస్ వదిలేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది.
ఇదిలా ఉండగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అతిక్రమించిందని హమాస్ ఆరోపించింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనియన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుమారు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఈ నెల 24న విరామం లభించింది. ఇరుపక్షాలు నాలుగు రోజులపాటు కాల్పులు జరపొద్దని ఒప్పందం చేసుకున్నాయి. దీంతో శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే రెండు రోజులు గడవకముందే ఇజ్రాయెల్ ఆ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ.. వెస్ట్ బ్యాంక్‌లోని క్వబాటియా, రమాల్లా, జెనిన్ ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిందని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment