ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో హమాస్‌తో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని.. అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. ‘‘జరుగుతున్న పోరులో భాగం అయ్యేందుకు హిజ్బుల్లా సిద్ధంగా ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు మేం రంగంలోకి దిగుతాం. ఇజ్రాయెల్ వ్యతిరేక పోరులో హమాస్‌తో చేతులు కలుపుతాం. మా ప్రణాళిక ప్రకారమే మేం ముందుకు వెళ్తాం’’ అని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్, బీరూట్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు.
‘‘చాలా దేశాలు, అరబ్ దేశాలు, ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా హిజ్బుల్లాను యుద్ధానికి దూరంగా ఉండమని కోరుతున్నాయి. కానీ, ఆ పిలుపును మేం పట్టించుకోం. ఏం చేయాలో హిజ్బుల్లాకు బాగా తెలుసు. సరైన సమయంలో రంగంలోకి దిగుతాం’’ అని ఖాసీమ్ తెలిపారు.
లెబనాన్‌లోని పాలస్తీనా గ్రూప్‌లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ గత కొంతకాలంగా టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. పైగా హిజ్బుల్లా ఉద్యమానికి ఇరాన్ మద్దతు కూడా ఉంది. సోమవారం.. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు ముగ్గురు మరణించారని హిజ్బుల్లా ప్రకటించుకుంది. మంగళవారం.. హిజ్బుల్లా పోస్టుల మీద దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. అదే సమయంలో హమాస్ విభాగం తమపై రాకెట్ దాడి జరిగిందని ప్రకటించింది. బుధవారం.. లెబనాన్ గ్రామం ధైరా వద్ద మోహరించిన ఇజ్రాయెల్ బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు హిజ్బుల్లా ప్రకటించుకుంది. అయితే.. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో హిజ్బుల్లాకు చెందిన ముగ్గురు గాయపడ్డారట.
ఈ దాడుల పర్వంలో.. శుక్రవారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రాయిటర్‌కు చెందిన జర్నలిస్ట్ దుర్మరణం పాలవ్వగా.. మరికొందరు జర్నలిస్టులు గాయపడ్డారు. అయితే ఈ పరిణామంపై ఇజ్రాయెల్ బలగాలు స్పందించాయి. ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడులకు ప్రతిగానే.. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఇది చోటు చేసుకుందని తెలిపింది.
మరోవైపు శుక్రవారం దక్షిణ బీరూట్‌లో వెయ్యి మంది హిజ్బూల్లా మద్దతుదారులు.. పాలస్తీనా జెండాలతో, బ్యానర్‌లతో ఊరేగింపు నిర్వహించారు. భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడంటూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment