ప్రమాదకర సాహసాన్ని
సునాయసంగా చేసిన సైక్లిస్టు
ఆన్‌లైన్‌లో 16 కోట్లు దాటిన వీక్షణలు
రోమ్: గతుకుల రోడ్లపై సైకిల్ సవారీ అంటే చాలా మంది భయపడిపోతారు. పడితే మోకాలి చిప్పలు పగలడం ఖాయమని అందరికీ తెలుసు. అలాంటిది అంతెత్తునుంచి పడితే భూమ్మీద నూకలు చెల్లిపోవడం ఖాయమని తెల్సి కూడా కొండ అంచుపై సైకిల్ తొక్కి ఈ సైక్లిస్ట్ తనకు భయం లేదని, సాహసమే తన ఊపిరి అని చాటాడు. ఇంత ఎత్తులో సైకిల్ తొక్కుతుంటే తొక్కే వారికే చెమటలు పడతాయిగానీ ఈ వీడియో చూసిన వారికి ముచ్చెమటలు పట్టడం ఖాయమని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు.
ధైర్యంగా, దిలాసాగా శిఖరాగ్రంపై సైకిల్ మీద దూసుకెళ్తున్న ఈ పర్వతారోహణ సైక్లిస్ట్ పేరు మాక్రో బసాట్. ఇటలీలోని ప్రఖ్యాత డోలమైట్ పర్వతాలపై తాను చేసిన సైకిల్ సవారీని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశాడు. ‘‘తప్పులకు తావు లేదు. ఆనందంతో నా హృదయం జ్వలిస్తోంది. ఆనంద అడ్రినలిన్ హార్మోన్‌తో మైమరిచిపోయా. ఇలా చేయడం నాకెంతో ఇష్టం’అంటూ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశాడు. వీడియో చూస్తున్నంతసేపు ‘‘అరెరే.. పట్టుతప్పి పడిపోతాడేమో’’అని మనసులో అనుకోవడం ఖాయం.
ఈ వీడియోను ఆన్‌లైన్‌లో ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఈయనను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టారు. ‘‘వీడియో చూసిన ఐదు సార్లూ షాక్‌కు గురయ్యా’, ‘చావంటే ఇతనికి భయం లేదనుకుంటా. చావుకు కూడా ఇతనంటే భయమేమో. అందుకే అది ఇతని దరి చేరట్లేదు’, ‘ఇదైతే కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో కాదుకదా!’, ‘వీడియో చూస్తున్నంతసేపు నా బీపీ పోటెత్తింది’, ‘51 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమిని వదిలేసి తమ్ముడు స్వర్గంలో విహారానికి బయల్దేరాడు’, ‘మాటల్లేవ్’అంటూ ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment