bicycle ride
-
కొండ అంచుపై బెదరకుండా!
రోమ్: గతుకుల రోడ్లపై సైకిల్ సవారీ అంటే చాలా మంది భయపడిపోతారు. పడితే మోకాలి చిప్పలు పగలడం ఖాయమని అందరికీ తెలుసు. అలాంటిది అంతెత్తునుంచి పడితే భూమ్మీద నూకలు చెల్లిపోవడం ఖాయమని తెల్సి కూడా కొండ అంచుపై సైకిల్ తొక్కి ఈ సైక్లిస్ట్ తనకు భయం లేదని, సాహసమే తన ఊపిరి అని చాటాడు. ఇంత ఎత్తులో సైకిల్ తొక్కుతుంటే తొక్కే వారికే చెమటలు పడతాయిగానీ ఈ వీడియో చూసిన వారికి ముచ్చెమటలు పట్టడం ఖాయమని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు. ధైర్యంగా, దిలాసాగా శిఖరాగ్రంపై సైకిల్ మీద దూసుకెళ్తున్న ఈ పర్వతారోహణ సైక్లిస్ట్ పేరు మాక్రో బసాట్. ఇటలీలోని ప్రఖ్యాత డోలమైట్ పర్వతాలపై తాను చేసిన సైకిల్ సవారీని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్చేశాడు. ‘‘తప్పులకు తావు లేదు. ఆనందంతో నా హృదయం జ్వలిస్తోంది. ఆనంద అడ్రినలిన్ హార్మోన్‌తో మైమరిచిపోయా. ఇలా చేయడం నాకెంతో ఇష్టం’అంటూ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశాడు. వీడియో చూస్తున్నంతసేపు ‘‘అరెరే.. పట్టుతప్పి పడిపోతాడేమో’’అని మనసులో అనుకోవడం ఖాయం. View this post on Instagram A post shared by Marco Bassot (@marcobassot) ఈ వీడియోను ఆన్లైన్లో ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఈయనను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టారు. ‘‘వీడియో చూసిన ఐదు సార్లూ షాక్‌కు గురయ్యా’, ‘చావంటే ఇతనికి భయం లేదనుకుంటా. చావుకు కూడా ఇతనంటే భయమేమో. అందుకే అది ఇతని దరి చేరట్లేదు’, ‘ఇదైతే కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో కాదుకదా!’, ‘వీడియో చూస్తున్నంతసేపు నా బీపీ పోటెత్తింది’, ‘51 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమిని వదిలేసి తమ్ముడు స్వర్గంలో విహారానికి బయల్దేరాడు’, ‘మాటల్లేవ్’అంటూ ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు. -
బాలిక ఉసురుతీసిన పోకిరీలు
అంబేడ్కర్‌నగర్(యూపీ): సైకిల్‌పై వెళ్తున్న బాలికను వేధించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు ప్రయత్నించారు. దుపట్టాను లాగేయడంతో ఆమె అదుపుతప్పి సైకిల్‌పై నుంచి పడిపోయింది. ఆ వెనుకే మరో యువకుడు ఆమెను బైక్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన యూపీలోని అంబేడ్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బర్హి అయిదిల్పూర్కు చెందిన నయన్శీ పటేల్(17) ఇంటర్ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వెళుతోంది. వేగంగా బైక్‌పై వచ్చిన ఆకతాయిలు ఆమె దుపట్టాను లాగడంతో అదుపుతప్పి కిందపడి పోయింది. ఆ వెనుకే బైక్‌పై వచ్చిన మరో యువకుడు ఆమె మీదుగా బైక్‌ను పోనిచ్చాడు. తీవ్రగాయాలతో బాలిక చనిపోయింది. ఈ అమానుషానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సెహబాజ్, అర్బాజ్, ఫైసల్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదివారం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరు పారిపోయేక్రమంలో కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. సదరు పోకిరీలు తన కూతుర్ని వేధిస్తున్నారంటూ వారం క్రితమే పోలీసులకు తెలిపినట్లు తండ్రి సభజీత్ వర్మ తెలపడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేశ్ పాండేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
సైక్లింగ్‌తో లైంగిక ఆరోగ్యానికి మేలు
న్యూయార్క్: సైకిల్ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది. సైకిల్ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని శాన్ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసే వారితో పోలిస్తే సైక్లింగ్ చేసేవారికి లైంగిక పటుత్వం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని వీరు చెబుతున్నారు. సైక్లింగ్‌తో కార్డియోవాస్యులర్ లాభాలతోపాటు కీళ్ల సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. సైక్లిస్ట్లలో బరువు సంబంధ సమస్యలు కూడా చాలా వరకు దూరమైనట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ బెంజమిన్ బ్రేయర్ వివరించారు. అధ్యయనంలో భాగంగా 2,774మంది సైక్లిస్టులు, 539మంది స్విమ్మర్లు, 789 మంది రన్నర్స్‌ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. -
సైకిల్‌పై 100 కిలో మీటర్లు
రంగారెడ్డి : ఈ చిత్రంలో సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న ఇతని పేరు కృష్ణ అగర్వాల్(32). హైదరాబాద్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సైకిల్‌పై తిరగడమంటే మహా సరదా. 50 కి.మీ పరిధిలో ఎటు వెళ్లాలన్నా అతని వాహనం ఇదే. అయితే ఈసారి 100 కి.మీ దూరం వెళ్లి రావాలనుకున్నాడు. నెట్లో సెర్చ్ చేయగా ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు (102 కి.మీ) కనిపించింది. అంతే శనివారం ఉదయం 5 గంటలకు సైకిల్‌పై తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. అక్కడ గంటసేపు సేదదీరిన తర్వాత 1.15 గంటలకు నగరానికి తిరుగుపయనమయ్యాడు. ఒక్క రోజులో సైకిల్‌పై 200 కిలోమీటర్ల దూరం వెళ్లాలన్న లక్ష్యంతోనే కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చానని, రాత్రి 8 గంటల వరకు నగరానికి చేరుకోవాలనీ తెలిపాడు. మరోసారి సైకిల్‌పై 300 కి.మీ దూరం వెళతానని ఉత్సాహంగా చెబుతూ ముందుకు కదిలాడు.