ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాలుగు స్టేట్స్‌లో భారీ విజయాన్ని అందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టి భారీ మెజార్టీతో కాషాయ జెండాను ఎగురవేసింది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో హోలీ పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని, బీజేపీ స్థానాల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని, తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా దేశంలో అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సైతం స్పందించింది. ప‍్రముఖ పత్రిక DAWN ఎన్నికల ఫలితాలపై ఓ కథనాన్ని రాసింది. దీనిలో బీజేపీ భారీ విజయాన్ని అందుకుందని పేర్కొంది. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ విజయం సాధించిందని తెలిపింది. కోవిడ్ కట్టడి, ఉద్యోగాల కొరత, వ్యవసాయ చట్టాల అమలుపై ఒకానొక సమయంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. ఎన్నికలపై ఆ ప్రభావం కనిపించలేదని వెల్లడించింది. మరోవైపు కరోనా సమయంలో పేదలకు ఉచిత రేషన్, అయోధ్య రామమందిర నిర‍్మాణం వంటి అంశాలు బీజేపీకి పాజిటివ్‌గా మారాయని రాసుకొచ్చింది. కొన్ని పథకాలు ప్రజలకు ఆకర్షించాయని పేర్కొంది. దీంతో ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నట్టు తెలిపింది.
అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుపై కూడా కీలక కామెంట్స్ చేసింది. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించిందని తెలిపింది. 2012 లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ కాలంలో ప్రజల ఆదరణను పొందినట్టు పేర్కొంది. ఢిల్లీ, పంజాబ్‌లో విజయాలు సాధించినట్టు రాసుకొచ్చింది. మరోవైపు Al Jazeera కూడా ఫలితాలపై స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీలు ఘన విజయాన్నిఅందుకున్నాయని తెలిపింది. బీజేపీ, ఆప్ పార్టీలు ప్రజల ఆదరణతో గెలుపొందినట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment