అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించిన ఇజ్రాయెల్
టెల్ అవీవ్: యుద్ధ నేరాల కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేయాలంటూ జారీ అయిన అరెస్ట్‌వారెంట్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఇజ్రాయెల్ ఆశ్రయించింది. తీర్పు వచ్చే వరకు ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్‌పై అరెస్టు వారెంట్లను నిలిపివేయాలని గురువారం న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్ కోరింది. తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువడేదాకా వారెంట్ అమలును నిలుపుదల చేయాలని వేడుకుంది.
గాజా స్ట్రిప్‌లో యుద్ధం చేస్తూ వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణానికి కారణమవుతూ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, అందుకే నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రకటించడం తెల్సిందే. హమాస్ సైనిక విభాగ సారథి మొహహ్మద్ డెయిఫ్‌పైనా ఇదే తరహాలో అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధి, అరెస్టు వారెంట్ల చట్టబద్ధతను తాము సవాలు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే, ఇజ్రాయెల్ ప్రభుత్వం పట్ల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఐక్యరాజ్య సమితి ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ మిత్రదేశాలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది.
2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20 వరకు మానవాళికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, యోవ్ గాలెంట్‌లపై అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఈ చర్యను నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఫ్రాన్స్‌లు నెతన్యాహుకు మద్దతు పలికాయి. వారెంట్ల జారీని తప్పుబట్టాయి. మిత్రదేశాలైన బ్రిటన్, కెనడా మాత్రం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం యూదుల పట్ల వివక్ష చూపిస్తోందని నెతన్యాహు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment