ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో అతి పెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. పెద్ద సంఖ్యలో రోగులు కన్ను మూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతోపాటు 7,000 మందికిపైగా సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడ ఉందన్న వాదనతో ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది.
నిత్యం తనిఖీలు చేస్తోంది. బయట నుంచి ఆహారం, నీరు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధనం, విద్యుత్ సరఫరా కాకుండా నిలిపివేసింది. గత ఐదారు రోజులుగా ఇక్కడ చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఐసీయూలోని రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి 22 మంది మరణించారని అల్–షిఫా డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాలి్మయా చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇక్కడి 50 మందికిపైగా రోగులు మరణించినట్లు సమాచారం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
హమాస్ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది మృత్యువాత పడ్డారన్నది తెలియరావడం లేదు. గత కొన్ని రోజులుగా మృతుల, క్షతగాత్రుల గణాంకాలను గాజా ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రభుత్వ అధికార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలమే ఇందుకు కారణం.
బందీలను హత్య చేస్తున్న హమాస్!
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. ఇప్పటిదాకా నలుగురు బందీలను విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద బందీగా ఉన్న 19 ఏళ్ల నోవా మర్సియానో అనే ఇజ్రాయెల్ మహిళా జవానును ఇప్పటికే హత్య చేశారు. ఆమె మృతదేహం అల్–షిఫా వద్ద లభ్యమైంది. అలాగే 65 ఏళ్ల మరో మహిళా బందీ సైతం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని అల్–షిఫా వద్ద గుర్తించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఆగని దాడులు.. అందని సాయం
గాజాపై ఇజ్రాయెల్ సేనలు భీకరస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాలస్తీనియన్లకు మానవతా సాయం అందడం లేదు. దాడులకు విరామం ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆహారం, ఔషధాలు, నిత్యావసరాను గాజాకు చేరవేయలేకపోతున్నామని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆకలి చావులు ప్రారంభం కావడం తథ్యమని తేలి్చచెప్పింది. మరోవైపు గాజాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఊహించినదాని కంటే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, సాధారణ జనావాసాలతోపాటు ఆసుపత్రుల్లోనూ జనం రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఇతర దేశాల నుంచి ఇంధనం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో జనరేటర్లు పనిచేయడంలేదు. విద్యుత్ లేక మొబైల్ ఫోన్ల సేవలు సైతం నిలిచిపోయాయి. గాజాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.
గాజాను ఆక్రమించొద్దు: బ్లింకెన్
హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత గాజా పరిస్థితి ఏమిటి అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని, అక్కడ తన కీలు»ొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరోసారి ఇజ్రాయెల్‌కు సూచించారు.
ఆఖరి గౌరవానికీ దూరం
ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతçస్తులే. దాడుల్లో నిత్యం పదుల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. భవనాలు నేటమట్టమవుతున్నాయి. కాంక్రీట్ దిబ్బలుగా మారుతున్నాయి. చాలామంది వాటికింద చిక్కుకొని తుదిశ్వాస విడుస్తున్నారు. గాజాలో చాలా ప్రాంతాలు శ్మశనాలను తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై 5 వారాలు దాటింది. గాజాలో ఇప్పటివరకు 1,500 మంది చిన్నారులు సహా 2,700 మంది కనిపించకుండాపోయారు. వారంతా శిథిలాల కింద విగతజీవులైనట్లు తెలుస్తోంది.
ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. మృతులకు సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయాలి. మృతదేహాలను సబ్బుతో శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు చుట్టి, పన్నీరు చల్లి 24 గంటల్లోగా ఖననం చేయాల్సి ఉంటుంది. గాజాలో వేలాది మంది ఈ ఆఖరి గౌరవానికి నోచుకోవడం లేదు. బయటకు తీసేవారు లేక శిథిలాల కింద శవాలు కుళ్లిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నాయి కరెంటు, డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో గాజాలో సహాయక చర్యలు ఎప్పుడో నిలిచిపోయాయి. భవనాల శిథిలాలను తొలగించేవారే లేరు. కనిపించకుండాపోయిన తమ బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం జనం గాలిస్తున్నారు. శవం కనిపించినా ఎవరిదో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఇదిగో హమాస్ సొరంగం..
అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో సొరంగంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న తన వాదనకు బలం చేకూర్చేలా వీడియోను, కొన్ని ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో గుహ లాంటి ప్రదేశం కనిపిస్తోంది. ఇది నిజంగా హమాస్ సొరంగమేనా? అనేది నిర్ధారించాల్సి ఉంది. అల్–షిఫా హాస్పిటల్‌లో హమాస్ ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అల్ షిఫా ఆస్పత్రి ఐసీయూ వార్డు (ఫైల్ ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment