117 మంది గాయపడ్డారని ప్రకటించిన లెబనాన్ ప్రభుత్వం
తమ నేతపై ఇజ్రాయెల్ హత్యాయత్నం విఫలమైందన్న హెజ్‌బొల్లా
బీరుట్/న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరుట్‌పై గురువారం రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య 22కు చేరుకుంది. తాజా ఘటనలో 117 మంది క్షతగాత్రులుగా మారారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెంట్రల్ బీరుట్‌లోని రస్ అల్–నబా, బుర్జ్ అబి హైదర్‌లపై ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో ఒక చోట ఎనిమిదంతస్తుల భవనం నేలమట్టం కాగా, మరో చోట ఓ భవన సముదాయంలోని దిగువ అంతస్తులు ధ్వంసమయ్యాయి.
తమ ముఖ్య అధికారి వఫిక్ సఫాను చంపేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని హెజ్‌బొల్లాకు చెందిన అల్ మనార్ టీవీ అనంతరం పేర్కొంది. దాడులు జరిగిన సమయంలో వఫిక్ ఆ రెండు భవనాల్లోనూ లేరని స్పష్టం చేసింది. తాజా దాడి, 2006 తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత తీవ్రమైందని పరిశీలకులు అంటున్నారు.
ఇటీవల బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన భీకర దాడుల్లో హెజ్‌బొల్లా నేత హస్సన్ నస్రల్లా సహా పలువురు కమాండర్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. హెజ్‌బొల్లా గురు వారం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మరో వైపు, భూతల, వైమానిక, క్షిపణి దాడులతో హెజ్‌బొల్లా లక్ష్యాలపై ఇప్పటికే విరుచు కుపడు తున్న ఇజ్రాయెల్ సముద్రంపై నుంచి కూడా దాడులకు పాల్పడుతుందని సమాచారం.
ఇద్దరు లెబనాన్ సైనికులు మృతి
లెబనాన్‌లోని బింట్ జబెయిల్ ప్రావిన్స్ కఫ్రాలోని ఆర్మీ చెక్ పాయింట్‌లోని భవనంపై శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు సైనికులు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు.
ఐరాస బలగాలపై మళ్లీ కాల్పులు
లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళాల (యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్)పై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డాయి. నఖౌరా పట్టణంలోని యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్ ప్రధాన కార్యాలయం అబ్జర్వేషన్ పోస్ట్‌పై జరిగిన కాల్పుల్లో ఇద్దరు సభ్యులు గాయపడ్డారు. ఒకరు టైర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐరాస తెలిపింది. అదేవిధంగా, దక్షిణ లెబనాన్‌లో ఐరాస గుర్తించిన 120 కిలోమీటర్ల బ్లూలైన్‌ను దాటి ఇజ్రాయెల్ ఆర్మీ బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు చొచ్చుకువచ్చాయని ఐరాస శుక్రవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment