వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రావడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తుందనే నమ్మకంతో డెమోక్రాట్స్ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్.. కమలా హారీస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చిందంటూ జిల్ బైడెన్ చెప్పుకొచ్చారు.
కాగా, అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్ బైడెన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జిల్ బైడెన్..‘మమ్మల్ని విశ్వసించిన వారికి నా కృతజ్ఞతలు. మీరు ఇన్ని రోజులు జో బైడెన్‌పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మాపై మీ అభిమానం ఎల్లప్పుడూ నా హృదయంలో నిండి ఉంటుంది. ఇప్పుడు కమలా హారీస్‌పై ఆ నమ్మకాన్ని ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆమెపై నాకు నమ్మకముంది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇక, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని జో బైడెన్ చెప్పుకొచ్చారు. తాజాగా జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. అలాగే, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment