
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తొలిసారి ప్రసంగించారు. ప్రపంచం ఇప్పుడు చరిత్రలోని ఒక సంధికాలంలో ఉందన్నారు. ఈ సమయంలో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కరోనా, వాతావరణ మార్పు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలపై అందరం ఏకతాటిపై ఉండాలన్నారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ మరో కోల్డ్‌వార్‌ను అమెరికా కోరుకోవడం లేదని తేల్చిచెప్పారు. అఫ్గాన్‌లో యుద్ధాన్ని ముగించి, సేనలను వెనక్కు పిలిచే నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 20ఏళ్ల సంక్షోభానికి ముగింపునిచ్చామని చెప్పారు. ఇకపై తమ శక్తిని ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజల అభివృద్ధికి వెచ్చిస్తామని చెప్పారు. ప్రసంగానికి ముందు ఆయన ఐరాస సెక్రటరీ గుటెరస్‌తో సమావేశమయ్యారు. ఐరాసకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా అమెరికా ఈజ్‌బ్యాక్ అనే తన ఎన్నికల నినాదాన్ని మరోమారు వల్లించారు.
మేం వచ్చేశాం..: ట్రంప్ హయాంలో ఐరాసకు అమెరికా నుంచి అందించే సాయానికి కత్తెర పడింది. అయితే తమ హయాంలో ఐరాసకు పూర్తి మద్దతునిస్తామని బైడెన్ చెప్పారు. పరోక్షంగా ఐరాసను తామే నడిపిస్తామన్నారు. ఇటీవల కాలంలో బైడెన్ నిర్ణయాలు యూఎస్ మిత్రపక్షాలకు ఇబ్బందిగా మారుతున్నాయి. కరోనా టీకాలను పంచుకోవడం, ప్రయాణ నిబంధనల రూపకల్పన, చైనాతో వ్యవహరించాల్సిన విధానాలు.. తదితర పలు అంశాలపై అమెరికాకు దాని మిత్రపక్షాలకు బేధాభిప్రాయాలువచ్చాయి. తాజాగా ఫ్రాన్స్‌తో ఏర్పడిన జగడం అమెరికాకు మరింత ఇబ్బందిగా పరిణమించింది. అయితే ఫ్రాన్స్‌తో సంబంధాలు బాగున్నాయని బైడెన్ సమర్ధించుకున్నారు.
ఇండోపసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాల్లో ఐరోపాను కలుపుకునిపోకపోవడంపై బైడెన్ యంత్రాంగాన్ని ఈయూ ప్రెసిడెంట్ ఛార్లెస్ తీవ్రంగా దుయ్యబట్టారు. అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణ, నాటో అంశాలు, ఆకుస్ కూటమి ఏర్పాటుపై విమర్శలు గుప్పించారు. అయితే ఐరాస సమావేశాలకు వచ్చిన వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపి అభిప్రాయబేధాలు రూపుమాపాలని బైడెన్ ప్రభుత్వ వర్గాలు యత్నిస్తున్నాయి. తద్వారా మరోమారు ప్రపంచ పెద్దన్నగా అమెరికాను మార్చాలని భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment