ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. వారిని రక్షించాలన్న జో బైడెన్‌ | Biden Urges Netanyahu To Protect Gaza Civilians In War | Sakshi
Sakshi News home page

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. జో బైడెన్‌ కీలక సూచన

Published Mon, Oct 30 2023 8:39 AM | Last Updated on Mon, Oct 30 2023 9:20 AM

Joe Biden Urges Netanyahu To Protect Gaza Civilians In War - Sakshi

జెరూసలేం: గాజాలో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఒకవైపు ఇజ్రాయెల్‌ వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూంటే ఇంకోవైపు పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. ఇరవైనాలుగు గంటల వ్యవధిలో 450 హమాస్‌ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం ప్రకటించింది.

మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక సూచన చేశారు. హమాస్‌ మిలిటెంట్లు, పౌరుల మధ్య తేడాను గుర్తించాలని బైడెన్‌ కోరారు. దాడుల్లో గాజాకు చెందిన అమాయక ప్రజలు మృతిచెందకుండా వారిని కాపాడాలన్నారు. పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు ఉన్నప్పటికీ సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. 

‘ద్విదేశ’ విధానమే పరిష్కారం
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, అరబ్‌ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని  చెప్పారు. 

ఆటలొద్దు.. గల్లంట్‌ వార్నింగ్‌
ఇదిలా ఉండగా.. హమాస్‌పై ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ ప్రకటించిన నేపథ్యంలో రక్షణ మంత్రి యోవ్‌ గల్లంట్‌ స్పందించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ బందీలపై హమాస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. మానసికంగా తమను బెదిరించే ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే, బందీలను విడిపెట్టేందుకు పలు షరతులు విధిస్తోందన్నారు. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన 300 మందికిపైగా పౌరులు గాజాలో హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. గాజాలోని హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్, ఇజ్రాయెల్‌తో తక్షణ ఖైదీల మార్పిడికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ సిద్ధంగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement