వెబ్‌డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ప్రతీ ఏడు జరుపుతుంటారు. పర్యావరణం అనగానే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌజ్ గ్యాస్,, కాలుష్యం పెరుగుదల ఇలా సాగిపోతుంది వరస. పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం, చెట్లు పెంచడం ఎంతో అనివార్యం కూడా. మాటల్లో చెప్పినట్టు చేతల్లో ఫలితాలు సాధించాల్సిందే. అయితే పర్యావరణం అంటే చెట్లు, చేమలే కాదు కొండలు, లోయలు, సేలయేర్లు, మంచు, ఏడారి ఇలా ప్రతీది పర్యావరణంలో భాగమే. ప్రతీది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని వింతలకు, విశేషాలకు నెలవై ఉంటాయి. మన దేశంలో పర్యావరణంలో భాగమైన ప్రకృతి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నింటినీ ఓసారి చూద్దాం.
లూనార్ క్రాటర్ లేక్
ప్రకృతి అద్భుతాల్లో ఒకటి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న లూనార్ క్రాటర్ లేక్. యాభై రెండు వేల సంవత్సరాల క్రితం గ్రహశకలాలు భూమిని బలంగా ఢీ కొట్టడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి వెడల్పు దాదాపు 1.8 కిలోమీటర్ల వెడల్పు, లోతు 137 మీటర్లు ఉంటుంది. గ్రహశకలాలు ఢీ కొట్టడం వల్ల ఏర్పడిన గొయ్యిలలో ఇదే ప్రపంచంలోనూ మూడో అతి పెద్దది. ఈ గొయ్యి నిండా ఆమ్ల లక్షణాలు ఉన్న నీరు చేరుకోవడంతో దీన్ని లూనార్ క్రాటర్ లేక్‌గా పిలుస్తున్నారు.
గ్రావిటీ హిల్
వేసవి వచ్చిందంటే చాలు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న బైకర్లు, అడ్వెంచరిస్టుల్లో చాలా మంది లద్ధాఖ్‌కు చేరుకుంటారు. లద్ధాఖ్ - కార్గిల్ హైవేలో ఉన్న మరో ప్రకృతి వింత గ్రావిటీ హిల్. లేహ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఈ వింతైన ప్రదేశం ఉంది. ఇక్కడ ఇంజన్ ఆఫ్ చేసినా సరే ఎత్తుగా ఉన్న వైపుకు వాహనాలు నడుస్తూనే ఉంటాయి. దీనికి ఆప్టికల్ ఇల్యూషన్ అని పేరు పెట్టినా .. భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగే ఈ వింతకు గల అసలైన కారణం ఇప్పటి వరకు తేలలేదు.
లోక్‌తాల్ సరస్సు
ప్రపంచం మొత్తం మీద నీటిపై తేలియాడే సరస్సు మణిపూర్‌లో ఉంది. దీన్ని లోక్‌తాల్ అంటారు. నీరు, భూమి కలిసిపోయి ఉండే సరస్సు కనుల విందుగా ఉంటుంది. నీళ్లపై నేల తేలియాడుతుందా అనేట్టుగా ఈ సరస్సు కనిపిస్తుంది. జీవ వైవిధ్యానికి ఇది నెలవు. ఇక్కడ వందల రకాల పక్షులు, మొక్కలు, ఇతర జీవరాశులు నివసిస్తున్నాయి.
సూది బెజ్జం
మనదగ్గర రామప్ప శిల్పి సూది బెజ్జం పట్టెంత నైపుణ్యంతో వందలాది శిల్పాలను చెక్కాడు. కానీ ప్రకృతి కొండల్ని వింతైన ఆకారాలుగా మాలిచిన చోటు మహారాష్ట్రలోని గోలేవాడి ప్రాంతంలో ఉంది. ఎత్తైన కొండ మీదున్న రాళ్లలో ఒకటి సూది బెజ్జంలా కనిపిస్తుంది. మరోవైపు ఇదే ఆకారం ఏనుగు తొండంలా కూడా కనిపిస్తుంది. నీడిల్‌పాయింట్ లేదా ఎలిఫెంట్ పాయింట్‌గా చెప్పుకునే ఈ ప్రదేశం చక్కని టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
వేర్ల వంతెనలు
ప్రపంచలోనే అత్యధిక వర్షపాతం మేఘాలయలోని చిరపుంజిలో నమోదవుతుంది. నిత్యం ఇక్కడ కురిసే వర్షాలతో ఈ కొండ ప్రాంతంలో వరద నీరు ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతుంది. దీంతో ఇక్కడ వంతెనల నిర్మాణం అంత సులువు కాదు. అందుకే 500 ఏళ్ల క్రితమే ఇక్కడి ప్రజలు వేర్లతో వంతెనలు కట్టే పద్దనికి కనుక్కొని అమలు చేస్తున్నారు. రబ్బరు చెట్ల వేర్లతో ఏర్పాటు చేసిన ఈ బ్రడ్జిలు చూడలను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది.
ఉప్పు ఎడారి
మగధీర సినిమాలో రామ్‌చరణ్ తెల్లటి ఉప్పు ఎడారిలో గుర్రం స్వారీ చేసే దృశ్యాలు రోమాంచితంగా ఉంటాయి. ఆ ఏడాది ఎక్కడో విదేశాల్లో లేదు. మన గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్‌లో ఉంది. ఇసుక ఎడారి, మంచు ఎడారి తరహాలో ఇది ఉప్పు ఎడారి. 2,897 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ ఉప్పు ఎడాది విస్తరించి ఉంది. పౌర్ణమి రోజుల్లో ఇసుక కూడా ఉప్పులానే కనిపిస్తుంది.
లావా స్థంభాలు
సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న కొండలు, రాళ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎగుడుదిగుడుగా, మొన తేలిన రాళ్లతో కూడి ఉంటాయి. కానీ కర్నాటక తీరంలో సెయింట్‌మేరిస్ ద్వీపంలో ఉన్న లావా స్థంభాలు ఇందుకు విరుద్ధం. అరేబియా సముద్ర తీరంలో పోత పోసిన షట్‌భుజి స్థంభాలాలు విరివిగా కనిపిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితం బద్దలైన అగ్నిపర్వతం లావా నుంచి ఈ శిలలు ఏర్పడి ఉంటాయని అంచనా. కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న మాల్పే నుంచి బోటు ద్వారా ఈ దీవికి చేరుకోవచ్చు.
ప్రకృతి హృదయ స్పందన
కేరళ రాష్ట్రంలోని చంబ్రా కొండలపైనా సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న కొలను ఉంది. పై నుంచి చూస్తే ఈ కొలను ప్రేమకు చిహ్నమైన హృదయం ఆకారంలో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment