కఠ్మాండు: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఆదివారం(జులై 14) నియమితులయ్యారు. మాజీ పీఎం పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే.పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు.
ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్(ఎన్‌సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల (సీపీఎన్-యూఎంఎల్- 77, ఎన్‌సీ- 88) సంతకాలను ఓలి సమర్పించారు. దీంతో కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు.
ఓలితో పాటు మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే ఓలి, దేవ్‌బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్‌బా ప్రధానిగా కొనసాగుతారు.ఓలికి దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment