న్యూయార్క్: తన పాట, ఆటతో 1960లు, 70ల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాకెన్ రోల్ క్వీన్, పాప్ సింగర్ టీనా టర్నర్ ఇక లేరు. సుదీర్ఘ అనారోగ్యం బారిన పడ్డ 83 ఏళ్ల టీనా జ్యూరిచ్ సమీపంలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. మిక్ జాగర్ మొదలుకుని బేయాన్స్ దాకా రాక్ స్టార్లంతా టీనా వీరాభిమానులేనంటే ఆమె స్థాయి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు!
ఎత్తుపల్లాలమయంగా సాగిన ఆమె జీవితం ఆద్యంతం ఆసక్తికరం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తనను పూర్తిగా గుల్ల చేసిన 20 ఏళ్ల వైవాహిక బంధం తాలూకు దెబ్బను అధిగమించి మరీ పాప్ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణి స్థాయిని అందుకున్నారామె. ఏకంగా 12 గ్రామీ అవార్డులు ఆమెను వచ్చి వరించాయి.
ఆమె ఆల్బంలు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా అమ్ముడవడమూ ఓ రికార్డే. టీనా స్ఫూర్తిమంతమైన జీవితం ‘వాట్స్ లవ్ గాట్ టు డూ వితిట్’ పేరిట 1993లో సినిమాగా వచ్చింది. భరించలేని బాధనంతా తనలోనే దాచుకుని ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దాన్నే శక్తిమంతమైన ఆయుధంగా మలచుకున్న అంతటి మహనీయ వ్యక్తికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అందులో టీనా పాత్ర పోషించిన నటి ఏంఎలా బాసెట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment